హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల మంత్రులు కె.తారక రామారావు, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు చెప్పారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ 900లకు పైగా సినిమాల్లో నటించి, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.