అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకట్రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతున్నది. ‘విశ్వంభర’ చిత్రాన్ని 90శాతం ఇండోర్‌లోనే తెరకెక్కించారు దర్శకుడు మల్లిడి వశిష్ట. కథానుసారం ఈ సినిమాకు 70శాతం సీజీ వర్కే ఉంటుంది. అందుకే.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న వివిధ స్టూడియోలు ఈ సినిమా సీజీకి వర్క్ చేస్తున్నాయి. వాటినుంచి పూర్తి అవుట్ పుట్ వచ్చాకే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించాలనేది ‘మెగా’ ఆదేశం.
అందుకు నిర్మాతలు సైతం కట్టుబడి ఉన్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడిల సినిమా విడుదల చేయనున్నట్టు ముందే ప్రకటించేసిన నేపథ్యంలో.. ఒక నాలుగు నెలలు తేడాతో ‘విశ్వంభర’ కూడా దానికంటే ముందే విడుదల కావాల్సివుంది. బహుశా ‘విశ్వంభర’ విడుదల దసరాకు ఉండొచ్చని ఫిల్మ్ వర్గాల టాక్. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణారెడ్డి, విక్రమ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.