Chiranjeevi | అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ఆయన మాట్లాడారు.క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇది దేవుడు ఇచ్చిన శాపం కాదు. మన జీవనశైలిలోని అలవాట్ల వల్లే ఎక్కువగా వస్తుంది” అని చిరంజీవి తెలిపారు. ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా జయించి సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన రోగులను చూసి డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతోందన్నారు. చిన్న వయసు పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవడం బాధాకరమని, ప్రతి ఒక్కరూ లక్షణాలపై అవగాహన పెంచుకుని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ… గతంలో 40–50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యం, రేడియేషన్ ప్రభావం, రసాయన పదార్థాల వినియోగం, ఎరువులు, మద్యం, ధూమపానం, ఒత్తిడి, డయాబెటిస్ వంటి అనేక కారణాలు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయని వివరించారు.
ప్రజల్లో అవగాహన కొరవడటం వల్ల చాలామంది చివరి దశలోనే వైద్యులను సంప్రదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే కిమ్స్ హాస్పిటల్స్‌లో “క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్” ను ఏర్పాటు చేశామని, చికిత్స పొందిన వారు తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి ధైర్యం చెప్పే వేదికగా ఇది పనిచేస్తుందని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం అనేక అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోటతో పాటు క్యాన్సర్‌ను జయించిన వారు, చికిత్స పొందుతున్న రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై అవగాహన పెంచి, భయాన్ని దూరం చేయాలన్న సందేశం బలంగా వినిపించింది.