India| కొన్ని నెలల ముందు టీ 20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దక్కించుకుంది. స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలిచామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో భాగం అయ్యాడు. అయితే ఇంత గొప్ప విజయం సాధించిన క్రమంలో టీమిండియాకి సెలబ్రిటీల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
టీమ్ గిండియా గెలుపుతో తాను గర్వంతో ఉప్పొంగిపోయారని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇండియా టీమ్ ఫైనల్లో గెలుపొందిన తర్వాత శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మనవాళ్ళను చూస్తుంటే గర్వంగా ఉంది అని, ఇండియా గెలుపును ఎంజాయ్ చేస్తున్నానంటూ జైహింద్ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక అద్భుతమైన మ్యాచ్ ను ఎంత ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు రామ్ చరణ్. టీమ్ ఇండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలిపారు చరణ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా టీమ్ ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు . టీమ్ ఇండియా విన్నింగ్ ట్రోఫీని గెలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇలా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.