‘ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను/ పాటలోనే నాదు ప్రాణాలు గలవందు’ అంటారు మహాకవి డా॥ సి.నారాయణరెడ్డి పాట మీదున్న తన ప్రేమను వ్యక్తపరుస్తూ. ఆధునిక తెలుగు కవిత్వంలో సినారె విరాణ్మూర్తి, వైవిధ్య సంభరిత విన్యాస విహారిణి. చేపట్టిన అన్ని సాహిత్య ప్రక్రియలు, రూపాల్లోనూ వారిది అగ్రేసర స్థానం. ఆధునిక తెలుగు కవితాలోకంలో అన్ని రూపాలు, ప్రక్రియల్లో మహాకావ్యాలు సృజించిన మన సినారెను మనసారా తలుచుకునే ప్రయత్నం ఇది. వెండితెరపై బంగారుపూలు పూయించిన ఆయన కలం నుంచి జాలువారిన పాటలను ఇకపై వారం వారం తలుచుకుందాం. పులకించిపోదాం. ఈ నెల 29న ఆ మహనీయుడి జయంతి కూడా! ‘సినీ సినారె’ శ్రీకారానికి ఇంతకన్నా మంచి ముహూర్తం ఇంకేముంటుంది?
‘పాటలోనే నా ప్రాణాలున్నా’యంటారు సినారె. 1962లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘గులేబకావళి కథ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తెలుగు సినీ అకాశంలో ‘పగలే వెన్నెల’లు కురిపించారు. నిజానికి సినారె సినిమాపాట అనగానే కొట్లాది తెలుగు హృదయాలు దోచుకున్న ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని/ కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి’ మదిలో మెదులుతుంది. ఇది మొదట రికార్డు కావడంతో తొలిపాటగా ప్రాచుర్యం పొందింది. నిజానికి సినారె ‘గులేబకావళి కథ’ కోసం రాసిన మొదటిపాట ’కలల అలలపై తేలెను, మనసు మల్లెపూవై… / ఎగసిపోదునో చెలియా, నీవే ఇక నేనై’ అనే యుగళ గీతం. అలా కలల అలలపై ఆయన చేసిన కళా సంతకం గురించి వివరంగా..
ఆమె: కలల అలలపై తేలెను, మనసు మల్లెపూవై
అతను: ఎగిసిపోదునో చెలియా, నీవే ఇక నేనై
ఆమె: కలల అలలపై
జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు?
॥జలకమాడు॥
అతను: తడిసీ తడియని కొంగున
ఆమె: ఊ..
అతను: ఒడలు దాచుకున్నందుకు
ఆమె: ఊ..
అతను: తడిసీ తడియని కొంగున ఒడలు
దాచుకొన్నందుకు
ఆమె: చూపుతోనె, హృదయవీణ ఝుమ్మనిపించే వెందుకు? ॥చూపు॥
అతను: విరిసీ విరియని పరువము మరులుగొలుపుతున్నందుకు…
ఈ పాటలోని చరణాలన్నీ నాయకీనాయకులు ప్రశ్నోత్తరాల రూపంలో సాగుతాయి. మొదట ఒక ప్రశ్న కథానాయకి విరసంగా విసురుతుంది. అటు తరువాత నాయకుడు ఆ ప్రశ్నకు సమాధానం సరసంగా పూరిస్తాడు. తరువాత మళ్లీ ప్రశ్న, మరో సమాధానం ఇలా సాగుతుందీ పాట. సినారె ప్రారంభించిన ఈ ఒరవడి తరువాత ఇతర సినీకవుల సినిమా పాటల్లోనూ చూడవచ్చు. ‘విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు’, ‘జవరాలిని చెలికాడిని జంటగూడి రమ్మన్నది’, ‘అగుపించని ఆనందం../ బిగికౌగిట కలదన్నది’ లాంటివి ఈ గీతానికి అందంతో పాటు చక్కని ప్రణయానుభూతిని అందించాయి.
నిజానికి ఈ పాటను వింటే నాయిక మనసులోని కోరిక ఇట్టే తెలుస్తుంది. ఆమె నాయకుని కౌగిలిలో కరిగిపోవాలని కోరుకుంటుంది. కానీ నర్మగర్భంగా ప్రయోగించిన పదాలు దానిని తెలిసీ తెలియనట్టు, కనిపించీ కనిపించనట్టు చూపిస్తాయి. సంప్రదాయానికి ప్రయోగాన్ని జోడించి, ప్రయోగానికి సంప్రదాయపు సొగబులద్దిన కవి సినారె. అందుకే ప్రాబంధిక పదబంధాలతో పాటు యాసలు, పలు భాషలు ‘గులేబకావళి కథ’ పాటల్లో గువ్వపిల్లలా అందంగా ఒదిగిపోయాయి. ఇందులో ఒకచోట చమత్కారం తలుక్కంటే మరోచోట, ‘ఎగిసిపోదునో’… ‘బిగికౌగిట కలదన్నది’ వంటి పాటకు బిగుతునిచ్చిన పదాలు కనిపిస్తాయి. ప్రసిద్ధ సంగీత దర్శకులు జోసఫ్-కృష్ణమూర్తి ద్వయం సంగీత దర్శకత్వంలో రికార్డయిన ఈ పాటను ఘంటసాల, జానకి ఆలపించగా ఎన్టీఆర్, నాగరత్నలపై చిత్రీకరించారు.
సినిమాలో మొత్తం పాటలు తానే రాయాలన్న సినారె మాటను గౌరవించిన ఏన్టీఆర్ ‘గులేబకావళి కథ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం సినారె మొత్తం పది పాటలు రాశారు. ఇందులోనే శాస్త్రీయ సంగీతబాణీలో రాసిన ’మదన సుందర నా దొర/ నా మది నిన్ను గని పొంగినదిరా వన్నెదొర’ పాట కూడా అంతే అలరించింది. ఇది అచ్చంగా జావళీ సరళిలో సాగిపోతుంది. ‘మాటకు దండం పెడతా… పాటకు దండం పెడతా’ అని చెప్పిన సినారె మాటల్లోనూ, పాటల్లోనూ, కవిత్వంలోనూ అనేక ప్రయోగాలు చేశారు. లయాన్విత సమన్వితమైన శైలి వారిది. సుతిమెత్తని పదాలను అత్యంత అందంగా పాట హారంలో పొదిగించే రస విద్య ఆయనకు బాగా తెలుసు. భాషలోనూ, ఆయన వాడిన అనేక యాసల్లోనూ, శైలి, వస్తువుల్లోనూ ఆ వైవిధ్యం కనిపిస్తుంది. పాటలోని విరుపులు, పాత్రోచితమైన మలుపులు, మెరుపులు మనకు అక్షరమక్షరాన కనిపిస్తాయి. తెలుగు సినీ ఆకాశంలో నిత్య ‘అమని’ మన సినారె.
– పత్తిపాక మోహన్