కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి బాలీవుడ్ తారలు భయపడతారని, ఎలాంటి విమర్శలు చేసినా దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం వారిలో ఉందని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌తో టీవీషోలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది బాలీవుడ్ తారలు ప్రభుత్వంపై విమర్శ చేయాలంటే భయపడతారు. ఏమైనా అంటే ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు.
ఇటీవల మెర్లీ స్ట్రీప్ అనే అమెరికన్ నటి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. కానీ భారత్‌లో అలా కాదు. ఇక్కడ తారలందరూ దర్యాప్తు సంస్థల భయంతో మౌనంగా ఉండిపోతారు. బాలీవుడ్‌ను వెనక నుంచి నడిపించేది మొత్తం బడా పారిశ్రామికవేత్తలే. వారితో పోరాడేంత పెద్దవారు కాదు సినీ తారలు’ అని జావేద్ అక్తర్ అన్నారు. బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతున్నా..ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని, ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.