Urvashi Rautela | చిన్నప్పుడు థియేటర్లో ‘ఖుషీ’ సినిమా చూస్తున్నప్పుడు గెంతులేస్తూ.. చప్పట్లు కొట్టిన అమ్మాయి.. ఇప్పుడు అదే సినిమా హీరో పవన్ కల్యాణ్‌తో తెర పంచుకుంటున్నది. ఆ నటి పేరు ఊర్వశి రౌతేలా. చేసిన సినిమాలు తక్కువే అయినా.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఏరికోరి మరీ అందాల భామ ఊర్వశిని సెలెక్ట్ చేశారు డైరెక్టర్ సముద్రఖని. ఈ బాలీవుడ్ భామ కార్వాన్ ముచ్చట్లు..
పుట్టి పెరిగింది హరిద్వార్‌లో.సెయింట్ జోసెఫ్ స్కూల్లో టెన్త్ వరకు చదివాను. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను.
ఇంజినీరింగ్ నా కల. ఐఐటీ ఎంట్రెన్స్‌కు ప్రిపేరయ్యాను. సరిగ్గా అప్పుడే ఫ్యాషన్ షో ఉండటంతో ఎగ్జామ్స్ రాయలేకపోయాను.
న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశాను. భరతనాట్యం, కథక్, బాలే, హిప్హాప్ వంటి అన్నిరకాల డ్యాన్స్‌లూ నేర్చుకున్నా. అందుకే.. మనం స్టెప్పేస్తే ఫ్యాన్స్ ఈల వేస్తారు.
‘సింగ్సాబ్ ద గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను. ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో అదృష్టం కలిసొచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. అదే అవకాశంగా మారి సినిమాల్లో ఛాన్స్ తెచ్చింది. టాలీవుడ్లో డ్యాన్స్ అంటే.. చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా. ‘వాల్తేరు వీరయ్య’లో ఆయన పక్కన డ్యాన్స్ చేయడం సవాలుగా అనిపించింది.
నాకు జువెలరీ, యాక్సెసరీస్ అంటే ఇష్టం. మొన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నేను ధరించిన మొసలి నెక్లెస్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు. మనం ఏదైనా చేస్తే అందరికీ తెలిసేలా
చేయాల్సిందే.
సినిమా కెరీర్ కంటే ముందే నాకు గ్లామర్ ప్రపంచం అలవాటైంది. పదిహేనేండ్లకే ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. విల్స్ లైఫ్ స్టైల్- ఇండియా ఫ్యాషన్ వీక్ టైటిల్ గెలుచుకున్నా. 2009లోనే మిస్ టీన్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్నా.
2015లో మిస్ దివా యూనివర్స్ అవార్డు వచ్చింది. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొన్నా.
ఒకవేళ సినిమాల్లోకి, ఫ్యాషన్ రంగంలోకి రాకపోయి ఉంటే.. కచ్చితంగా ఏరోనాటికల్ ఇంజినీర్ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాన్ని.
చాలామంది నేను ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్‌ని వన్‌సైడ్ లవ్ చేస్తున్నానని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వార్తలకైతే లెక్కేలేదు. అయితే.. నా మనసులోని గ్రీకువీరుడు ఎవరో ఇప్పుడే చెప్పను.
మన దగ్గర ఉన్నదాంట్లో ఎంతోకొంత ఎదుటివారితో పంచుకోవాలనే సూత్రాన్ని నేను అనుసరిస్తాను. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ పేరుతో పేదవాళ్లకు సాయం చేస్తున్నా. వైద్యం, చదువు అందిస్తున్నా.
“Urvashi Rautela | అమ్మో ! ఊర్వశి రౌతెలా వేసుకున్న మొసలి నెక్లెస్ అన్ని వందల కోట్లు ఉంటుందా?”