Sunny Leone | గ్లామర్ బాంబ్ సన్నీ లియోన్.. వ్యక్తిత్వం చాలా వినూత్నం. ఆమె అందచందాల వెనుక అంతకుమించిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కన్న సన్నీ.. మరొకరిని దత్తత తీసుకొని ముగ్గురు బిడ్డల తల్లయింది. తనపై వచ్చే విమర్శలపై ఒక్కోసారి ఆవేశంతో విరుచుకుపడే ఆమె.. మరోసారి జడివానలా గాసిప్స్ దాడి చేస్తున్నా పట్టించుకోదు. ఆ జీవితం తెరిచిన పుస్తకం కాదు. అందులోని కొన్ని పేజీలు తిరగేస్తేగానీ సన్నీని అంచనా వేయలేం..
ఎవరి దయాదాక్షిణ్యాలతోనో నేను ఎదగలేదు. నా ప్రతి అడుగూ నేను వేసిందే! ఏ సపోర్ట్ లేకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాను. ప్రతి సినిమా నాకు కొన్ని అనుభవాలు నేర్పింది. నన్ను నేను మార్చుకుంటూ, ప్రతిసారీ నేనేంటో రుజువు చేసుకున్నాను.
గ్లామర్ ఫీల్డ్‌లో విమర్శలు సహజం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పుకార్లకు బెంబేలెత్తిపోయేదాన్ని. నన్ను టార్గెట్ చేసే వ్యక్తులకు నా అసలు స్వభావం ఏంటో తెలియదు. నేను ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం అస్సలు తెలియదు. అలాంటి చౌకబారు వ్యక్తులు చేసే నాసిరకం కామెంట్లకు స్పందిస్తే మన స్థాయి కూడా తగ్గుతుందని కొన్నాళ్లకు అర్థమైంది. అప్పటినుంచి పట్టించుకోవడం మానేశా!
అమ్మతనం భగవంతుడిచ్చిన గొప్పవరం. ఆ అనుభూతిని తల్లి పరిపూర్ణంగా అనుభవించాలంటే.. పిల్లల ఆలనాపాలనా తనే స్వయంగా చూసుకోవాలి. సినిమాలు, ఇతర వ్యాపకాలు ఎన్ని ఉన్నా.. పిల్లల తర్వాతే ఏదైనా! నా దగ్గర్నుంచి సమయం లేదనే మాట రాదు. పిల్లలను దగ్గరుండి చూసుకోవడానికి ప్రాధాన్యమిస్తా. కేర్ టేకర్స్‌కు అప్పగించే ప్రసక్తే ఉండదు. ముద్దులొలికే చిన్నారులను ముచ్చటగా చూసుకోవడం కన్నా ఆనందం ఏముంటుంది? అందుకే, పిల్లల విషయంలో నేను, మా ఆయన ఇద్దరం చాలా కచ్చితంగా ఉంటాం.
మా ఆయన డానియల్ యూదు. మేం సిక్కులం. మనఅభిమతాలు ఉన్నతమైనవైతే మతం ఏదైనా సమస్య రాదు. మా ఇద్దరి ఆలోచనలూ బాగా కుదిరాయి. అందుకే మా ప్రయాణం ఇంత ఆనందంగా ఉంది. మా ఇంట్లో అన్ని పండుగలూ అంగరంగ వైభవంగా చేసుకుంటాం. దీపావళి సంబురాలూ చేసుకుంటాం, క్రిస్మస్ వేడుకలూ జరుపుకొంటాం.
సెలెబ్రిటీగా నా పిల్లల ప్రైవసీ నాకు ముఖ్యం. అలాగని వాళ్లను ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా పెంచాలని భావించడం లేదు. అందుకే, మా ఇంట్లో ఏ వేడుక జరిగినా పిల్లలతో కలిసి ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటా! అందులో రకరకాల కామెంట్లు చేస్తుంటారు. వాటన్నిటినీ పట్టించుకుంటే మనుగడ సాగించలేం!
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కడుపు మాడ్చుకోక తప్పదు. ఎన్ని తినాలని ఉన్నా.. కొన్నిటికీ ‘నో’ అనాల్సిందే! రోజువారీ డైట్లో అన్నీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలే ఉంటాయి. రుచి విషయంలో రాజీ పడకతప్పదు. దీనికితోడు బద్ధకిస్తే ఒళ్లు మాట వినదు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాల్సిందే! మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఇప్పుడు అలవాటై పోయింది. జిహ్వ చాపల్యాన్ని ఎప్పుడో జయించాను!!
ప్రతి మనిషిలో దైవికమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అయితే, మనమే లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చి ఆ శక్తిని నిస్తేజం చేసుకుంటున్నాం. మంచి పనులు చేస్తూ, నలుగురికీ సాయం చేయడం ద్వారా మనలో ఉన్న శక్తి వెలుగుచూస్తుంది. నా వరకైతే కొందరు దైవదూతలు నన్ను నిరంతరం రక్షిస్తూ ఉంటారని నమ్ముతాను. ఏ దారీ తోచని పరిస్థితుల్లో వాళ్లు నాకు దిశానిర్దేశం చేశారేమో అనిపిస్తుంటుంది.
“Sunny Leone | తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న సన్నీలియోన్..”