కథల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటానని అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకం ఉంచారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమనీ చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన సినీ జీవితం గురించిన ముచ్చట్లు పంచుకున్నది. “సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటా. కథలను జాగ్రత్తగా ఎంపిక చేస్తుంటా. ఈ క్రమంలో భవిష్యత్తులో నా సెలెక్షన్స్ కొన్ని బెడిసి కొట్టొచ్చు. అయినా, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా. ఎందుకంటే, ప్రయోగాలు చేయడానికి నేను భయపడను. అదే సమయంలో నాకు నచ్చని ప్రాజెక్టుకు ‘నో’ చెప్పడానికి కూడా ఏమాత్రం సంకోచించను” అంటూ చెప్పుకొచ్చింది.
అయితే, తన దగ్గరికి వచ్చే ప్రతి పది ప్రాజెక్టులలో తొమ్మిదింటిని తిరస్కరిస్తుందట శ్వేతాబసు. మంచి పాత్ర కోసం ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా ఫర్వాలేదనీ, త్వరత్వరగా సినిమాలు చేయాలనే హడావుడి తనకు ఏమాత్రం లేదనీ అంటున్నది. ఇక పరిశ్రమలో ఉండే ఒత్తిడి, హంగూఆర్భాటాల గురించీ పంచుకున్నది. “నేను సాధారణ జీవనశైలిని ఫాలో అవుతా. అదే నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తున్నది. నా జీవితంలో అనవసరమైన ఖర్చులు, ఆర్భాటాలు లేవు. అందరి అంచనాలకు తగ్గట్టు బతకాలని, నిత్యం ఫొటోషూట్లు చేయాలని ఎప్పుడూ అనుకోను. మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనీ, పార్టీలలో కనిపించాలనే ఒత్తిడి కూడా నాపై ఉండదు” అంటూ తన జీవనశైలి గురించి వెల్లడించింది. పని లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం, పని ఉన్నప్పుడే బయటికి రావడం తనకు ఇష్టమని అంటున్నది.
శ్వేతాబసు కెరీర్ విషయానికి వస్తే.. 2002లో బాలీవుడ్ చిత్రం ‘మక్టీ’లో బాలనటిగా అరంగేట్రం చేసింది. ‘కహానీ ఘర్ ఘర్ కీ’ అనే టీవీ సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. 2008లో వచ్చిన తెలుగు సినిమా ‘కొత్త బంగారు లోకం’తో హీరోయిన్గా మారింది. మొదటి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగి.. నాటి కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. 17 ఏళ్లకే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకున్నది. కానీ, అంతలోనే అనుకోని చిక్కుల్లో చిక్కుకొని.. అథఃపాతాళానికి పడిపోయింది. కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న శ్వేతాబసు.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఈ ఏడాది ఆమె నటించిన ఊప్స్.. అబ్ క్యా?, క్రిమినల్ జస్టిస్‌తోపాటు, తాజాగా మహారాణి సీజన్-4 వెబ్‌సిరీస్ విడుదలైంది.