నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోమవారం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. నేటి యువత మాదక ద్రవ్యాల వల్ల ఎలా పెడదారులు పడుతున్నారనే విషయాన్ని చూపిస్తూ, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది.
తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని భావించారు. అయితే క్రిస్మస్ బరిలో పలు చిత్రాలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను తగ్గించడానికి ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాసర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా గుణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.