‘నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ అన్నారు నిర్మాత బత్తిని కీర్తిలత గౌడ్. రాజా నరేందర్‌తో కలిసి ఆమె నటించి, నిర్మించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహనరావు మాట్లాడుతూ ‘ఇటీవలే ‘బలగం’ సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని, అనుబంధాల్ని కళ్లకు కట్టినట్లు చూపి సూపర్ సక్సెస్ సాధించింది. అదే కోవలో ఇప్పుడు ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా విజయవంతం కావడం సంతోషంగా వుంది. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, ఔన్నత్యం, ఔచిత్యం సంప్రదాయాలకు పెద్దపీట వేసిన ఇలాంటి సినిమాలను ప్రజలు తప్పకుండా ప్రోత్సహించాలి’ అన్నారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.