అఖండ (Akhanda) విజయంతో ఉత్సాహంలో ఉన్న బాలకృష్ణ (Balakrishna) కొత్త సినిమా షూటింగ్ లకు సిద్ధమవుతున్నారు. ఆయన కొత్త సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని (Gopichnad Malineni) దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనుంది. ఎన్ బీకే107 గా పిలుచుకుంటున్న ఈ సినిమా గతేడాది నవంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది.
ఎన్బీకే 107 (NBK 107) గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికర విషయం ప్రచారమవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. పదేళ్ల కిందట బాలకృష్ణ అధినాయకుడు అనే సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. మళ్లీ దశాబ్ద కాలం తర్వాత బాలకష్ణ ట్రిపుల్ రోల్ చేస్తుండటం విశేషం.
క్రాక్ సినిమాతో రవితేజతో మాస్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని..బాలకృష్ణతో పూర్తి కమర్షియల్ అంశాలతో ఎన్ బీకే 107ను రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ మొత్తం కుదిరారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా.
రాయలసీమ నేపథ్యంతో ఎన్ బీకే107 తెరకెక్కనుందని సమాచారం. రాయలసీమ ప్రాంతం గురించి ఒక సమస్యను కూడా ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారట. బాలకృష్ణ రాజకీయ ప్రస్థానం కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. కాబట్టి అక్కడి సమస్యలను తన సినిమాలో చూపించడం ద్వారా స్థానిక ప్రజలకూ బాలకృష్ణ మరింత దగ్గరయ్యే అవకాశాలున్నాయి.