Bala Krishna | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకలు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు తిప్పికొట్టారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమణం చెందారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2022 డిసెంబర్ లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్ గా ఎంపికయ్యి బోర్డర్ లో సేవలందిస్తున్నారు.
మురళీ నాయక్ వీరమరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి నాయక్ మృతదేహం గోరంట్ల మండలం కళ్లితాండా గ్రామానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మురళీ నాయక్ మరణం చాలా బాధని కలిగించిందని బాలకృష్ణ అన్నారు. ఇక తాజాగా మురళీ నాయక్ కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించారు బాలకృష్ణ. తన వంతుగా ఒక నెల జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తున్నట్టు ప్రకటించారు బాలయ్య.
మే 12న బాలకృష్ణ మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి తాను ప్రకటించిన నగదు అందజేయనున్నారు. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి అంటే చాలా ఎక్కువ. దీంతో.. రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ తీవ్రవాదుల ఎదురుదాడిలో పోరాడి ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టి చివరకు తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు.. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం చంద్రబాబు తెలిపారు. వీరజవాను మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు