ప్రఖ్యాత తమిళ నిర్మాత, ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు అయిన ఏవీఎం శరవణన్(85) చెన్నైలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు శరవణన్. ఏవీఎం ప్రొడక్షన్స్ 300పైచిలుకు చిత్రాలను నిర్మించిందంటే.. ఆ ఘనతకు కారకుల్లో శరవణన్ కూడా ఒకరు. ఎన్టీఆర్‌తో చిట్టిచెల్లెలు, రాము.. అక్కినేనితో ‘మూగనోము’, కృష్ణతో పుట్టినిల్లు మెట్టినిల్లు, అవేకళ్లు, చిరంజీవితో ‘పున్నమినాగు’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు శరవణన్.
1987లో ఆయన నిర్మించిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమా ఆ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. శరవణన్ తమిళంలో నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. శరవణన్ మృతితో చెన్నై చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొన్నది. పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అగ్ర నటుడు రజనీకాంత్, సూర్య, ఆయన తండ్రి శివకుమార్ తదితర తమిళ ప్రముఖులు శరవణన్‌కి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. శరవణన్ భౌతికకాయాన్ని సందర్శించిన హీరో సూర్య ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. సూర్య హీరోగా సుందరాంగుడు, వీడొక్కడే చిత్రాలను శరవణన్ నిర్మించిన విషయం తెలిసిందే.