హైదరాబాద్: మీడియాపై సినీనటుడు మోహన్‌బాబు (Mohan Babu) దాడి కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలుత ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. దానిని హత్యాయత్నం కేసుగా మార్చారు. 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌బాబుతోపాటు బౌన్సర్ల, సహాయకులు.. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతోపాటు కర్రలతో కొట్టారు. ఓ చానల్ ప్రతినిధి చేతిలో ఉన్న మైక్‌ను లాక్కున్న మోహన్‌బాబు.. ఆయన ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ చానల్ కెమెరామెన్ కింద పడ్డారు. ఈ నేపథ్యంలో బాబుపై పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా టీయూడబ్ల్యూజే, పలు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా, కాప్రా ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు రాచకొండ సీపీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని సీపీని కోరారు. మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.