Marakkuma Nenjam concert | ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ నిర్వహించిన మరక్కుమ నెంజం(Marakkuma Nenjam concert) కన్సర్ట్కి సంబంధించి చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కన్సర్ట్ని చూడలేకపోయిన ఓ ఫిర్యాదుదారుడికి రూ. 50,000 పరిహారం చెల్లించాల్సిందిగా ఈవెంట్ నిర్వహణ సంస్థను కోర్టు ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే.. 2023 చెన్నైలో మరక్కుమ నెంజం(Marakkuma Nenjam concert) పేరుతో రెహమాన్ భారీ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటగా ఆగస్టు 12న జరగాల్సిన ఈ కన్సర్ట్.. భారీ వర్షాల కారణంగా రద్దు చేయబడి.. ఆ తర్వాత సెప్టెంబర్ 10న విజయవంతంగా నిర్వహించారు. అయితే ఆగష్టులో కొనుగోలు చేసిన టిక్కెట్లతోనే అభిమానులు సెప్టెంబర్ కన్సర్ట్కి హాజరు కావచ్చని నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే చెన్నైలోని అన్నా నగర్‌కు చెందిన అర్జున్ అనే వ్యక్తి పార్కింగ్తో సహా రూ.10,000 చెల్లించి ఈ కన్సర్ట్ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఈ కన్సర్ట్ జరిగిన రోజున ట్రాఫిక్ రద్దీ.. అలాగే కన్సర్ట్ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలన అతను కచేరీ ప్రదేశానికి చేరుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్జున్, వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
తన ఫిర్యాదులో.. “నేను రూ. 10,000 చెల్లించి రెహమాన్ కన్సర్ట్ టికెట్ కొన్నాను. కానీ ఆ కన్సర్ట్ చూడలేకపోయాను. ఈ ఘటన నాకు చాలా బాధ కలిగించింది. కాబట్టి, నేను అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 10 లక్షలతో పాటు టిక్కెట్ రుసుమును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఫిర్యాదులో కోరాడు. అయితే అర్జున్ ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల కమిషన్, రెహమాన్ కన్సర్ట్ని నిర్వహించిన ACTC సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోపు పిటిషనర్ అర్జున్‌కు రూ. 50,000 పరిహారంగా.. అలాగే రూ. 5,000 న్యాయపరమైన ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ. 55,000 చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది.
Read More