జీవితం తాలూకు అనిశ్చితిని ఊహించలేమని, అందుకే స్నేహంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని, విభేదాలను మనసులో పెట్టుకుంటే చివరకు అంతులేని ఆవేదన మిగులుతుందని తాత్విక ధోరణిలో మాట్లాడింది అగ్ర కథానాయిక అనుపమ పరమేశ్వరన్. అనూహ్యంగా ఈ లోకాన్ని వీడిన తన మిత్రుడి గురించి తలచుకొని ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నాకో క్లోజ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతనితో ఏవో మనస్పర్థల కారణంగా మాట్లాడటం మానేశాను.
అనవసరమైన గొడవలు ఎందుకని అతని మెసేజ్‌లకు కూడా స్పందించేదాన్ని కాదు. ఓసారి అలాగే తను మెసేజ్ చేశాడు. నేను పట్టించుకోలేదు. అయితే రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడనే విషయం తెలిసి షాక్కిగురయ్యా. మనల్ని ప్రేమించే వాళ్లతో వచ్చే అభిప్రాయభేదాలు ఒక్కోసారి జీవితకాల విషాదాన్ని మిగుల్చుతాయని ఆ సంఘటనతో అర్థమైంది’ అంటూ ఉద్వేగానికి గురైంది అనుపమ పరమేశ్వరన్. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘కిష్కింధకాండ’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతున్నది.