సినిమా ఇండస్ట్రీ (Cinema Industry)లో కొందరు దర్శకులకు కావాల్సినంత టాలెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్లకు అది నిరూపించుకోవడానికి ఎప్పుడో గాని అవకాశాలు రావు. అలా వచ్చినప్పుడు వెంటనే దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటారు వాళ్లు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ KV (Anudeep KV). పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన..గతేడాది జాతి రత్నాలుతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు 38 కోట్ల షేర్ వసూలు చేసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది.
జాతి రత్నాలు (Jathi Ratnalu) సినిమా చూసిన తర్వాత అనుదీప్ దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కామెడీని ఈ దర్శకుడు డీల్ చేసిన విధానం హీరోలను అతడి బుట్టలో పడేస్తోంది. ప్రస్తుతం ఈయన శివకార్తికేయన్ (Shiva Karthikeyan) హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతుంది. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న శివకార్తికేయన్ సినిమాను..అప్పుడే సగానికిపైగా పూర్తిచేశాడు అనుదీప్. పైగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఆగస్టు 31న వినాయక చవితి సందర్భంగా శివ కార్తికేయన్ సినిమా విడుదల కానుంది. దీనిపై తెలుగు, తమిళంలో మంచి అంచనాలున్నాయి. ఇందులో ఉక్రెయిన్ బ్యూటీ మారియా హీరోయిన్గా పరిచయం అవుతుంది. శివ కార్తికేయన్ తర్వాత వెంకటేష్ హీరోగా సినిమా చేయబోతున్నాడు ఈ కుర్ర దర్శకుడు. మొత్తానికి జాతి రత్నాలు తర్వాత వేగంగా సినిమాలు చేసుకుంటూ దూసుకొస్తున్నాడు ఈ దర్శక రత్నం.