‘నేను భారతీయుడ్ని. ఈ మట్టిలోనే పుట్టాను. ఈ మట్టిలోనే కలిసిపోవాలనేది నా కోరిక. ఏ దేశంలో ఉన్నా నా సంప్రదాయాలను వదులుకోలేదు. ఓ చిన్న తప్పు నన్ను భారతీయ పౌరసత్వానికి దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ పొందగలిగాను. చెప్పలేని సంతోషంగా ఉంది’ అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్. ఆయన ఇటీవలే భారత పౌరసత్వాన్ని పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక దశలో నేను చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. నిర్మాతలకు తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టాయి. దాంతో మిగిలిన రెండు సినిమాలనూ పూర్తి చేసి, దేశం వదిలి కెనడా వెళ్లిపోయాను. అక్కడ రెండేళ్లుండగానే నాకు కెనడా పౌరసత్వం లభించింది.
యాదృచ్ఛికంగా ఇక్కడ చివరిగా నేను చేసిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మళ్లీ అవకాశాలు మొదలయ్యాయి. దాంతో కెనడా వదిలి మళ్లీ మన దేశం వచ్చేశాను. కానీ కెనడా పౌరసత్వం తీసుకున్న కారణంగా భారతీయ పౌరసత్వానికి దూరమయ్యాను.
అది కొన్నేళ్లుగా నన్ను బాధిస్తూనే వుంది. చివరకు కెనడా సభ్యత్వం వదులుకున్నాను కూడా. రీసెంట్గా కొన్ని నెలల ముందు మళ్లీ నన్ను భారతీయుడిగా గుర్తించి పౌరసత్వం అందించారు. అలాగే భారత్ పాస్‌పోర్ట్ కూడా నాకు వచ్చింది. దీన్ని కేవలం ట్రావెలింగ్ డాక్యుమెంట్ మాత్రమేనని నేను అనుకోవడంలేదు. ఇది నాకు ఆత్మ. వీటిని చూసినప్పుడు భారతీయుడిగా నా హృదయం ఉప్పొంగుతుంది’ అన్నారు అక్షయ్ కుమార్.