Thaman | టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడమే కాదు.. వరుసగా ట్రోలింగ్‌కు గురయ్యే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ ఒక్కడే. దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేస్తారు కానీ ట్రోలర్స్ ముందుగా ఫోకస్ చేసేది మాత్రం తమన్ పైనే. మనోడి సాంగ్ కొత్తగా ఏదైనా విడుదలైంది అంటే చాలు.. వెంటనే అది ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు అంటూ ఆరా తీస్తుంటారు. ఒకవేళ నిజంగానే అది ఒరిజినల్ సాంగ్ అయినా కూడా తమన్‌కు ట్రోలింగ్ తప్పదు. దానికి ఆయన కూడా అలవాటు పడిపోయాడు.
ఒకప్పుడు సీరియస్‌గా తీసుకునే వాణ్ని కానీ.. ఇప్పుడు మాత్రం చాలా కామెడీగా తీసుకుంటాను.. చూసి ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నాడు తమన్. తాజాగా రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న స్కంద సినిమాలోని పాట విడుదలైంది. ఇంగ్లీష్ రాప్‌తో మొదలైన ఈ పాట జై లవకుశ సినిమాలోని ట్రింగ్ ట్రింగ్ మ్యూజిక్ నుంచి కాపీ కొట్టాడు అంటూ తమన్ ను ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ వచ్చే బీట్ మొత్తం ఎన్టీఆర్ పాట మాదిరే ఉంటుంది. దాంతో అదే బీట్ కాస్త మార్చి ఇప్పుడు రామ్ సినిమా కోసం తమన్ వాయించేశాడు అంటూ ఆయన్ని వాయిస్తున్నారు పాపం.
అది కాపీ ట్యూనా లేదంటే ఒరిజినల్ ట్యూనా అనేది పక్కన పెడితే సిధ్ శ్రీరామ్ వాయిస్.. రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్.. శ్రీలీల గ్లామర్ తో ఇన్స్టాంట్ హిట్ అయింది ఈ పాట. యూ ట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. రేపు సినిమా విడుదలైతే ఖచ్చితంగా మరింత వైరల్ అవ్వడం ఖాయం. అయినా కాపీ ట్యూన్స్ అంటూ తమన్‌ను ట్రోల్ చేయడం కూడా ఒకరకంగా తప్పే అవుతుందేమో. ఎందుకంటే దర్శక నిర్మాతలు ఓకే చెప్పకుండా.. హీరోలు ఓకే అనకుండా బయటికి రావు ఆ పాటలు. మరి అలాంటప్పుడు తమన్ ఒక్కడినే తప్పు పట్టడం తప్పే అవుతుంది. ప్రస్తుతం ఈయన చేతిలో డజన్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమన్ కావాలంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు అయితే వరుసగా ఈయననే తీసుకుంటున్నారు. కొంతమంది దర్శకులకు తమన్ ఆ స్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు.