Dharma Productions | కరణ్ జోహార్ (Karan Johar).. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘కుచ్ కుచ్ హోతా హై’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కరణ్ జోహార్.. అతి తక్కువ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరిగా ఎదిగారు. దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ చాలా సినిమాలు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ (Dharma Productions) ద్వారా.. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసి.. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించారు. అయితే, గత కొన్ని రోజులుగా తన నిర్మాణ సంస్థను కరణ్ జోహార్ అమ్మకానికి పెట్టినట్లు తెగ వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ధర్మా ప్రొడక్షన్స్ (Dharma Productions)ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి. అయితే, చివరికి టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla)కు ఈ అవకాశం వరించింది. ఈ ధర్మా ప్రొడక్షన్లో పూనావాలా ఏకంగా రూ.వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా ధర్మా ప్రొడక్షన్లోని 50 శాతం వాటాను అదర్ పూనావాలా నేతృత్వంలోని సెరెన్ ప్రొడక్షన్స్ (Serene Production) దక్కించుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక ఈ డీల్ తర్వాత ధర్మా ప్రొడక్షన్స్ విలువ ఏకంగా రూ.రెండు వేల కోట్లకు పెరుగుతుందని సెరీన్ ప్రొడక్షన్ పేర్కొంది.
ఇకపై ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కరణ్ జోహార్ సినిమా నిర్మాణం చూసుకుంటారని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపూర్వ మెహతా పొడక్షన్ ఆపరేషన్స్ చూసుకుంటారని స్పష్టం చేసింది. భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో, ప్రేక్షకుల అభిరుచి మేరకు హై-క్వాలిటీ కంటెంట్‌ను క్రియేట్ చేయడంపై తమ ప్రొడక్షన్ దృష్టిసారిస్తుందని తెలిపింది.
Also Read..
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్
Bengaluru | బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం.. పాఠశాలలకు సెలవు