Nivetha Pethuraj | తమిళంలో పరిచయమై.. ‘మెంటల్ మదిలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నివేతా. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ తమిళ కుట్టి ఆ తర్వాత వరుసగా నాలుగైదు తెలుగు ఛాన్సులు కొట్టేసింది. ‘అల వైకుంఠపురంలో’, ‘విరాటపర్వం’ సినిమాల్లో మెప్పించి ఇప్పుడు విశ్వక్సేన్తో జోడీ కట్టింది. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో కుర్రకారుకు తన అందచందాలతో ధమ్కీ ఇస్తున్న నివేతా పేతురాజ్ ముచ్చట్లు..
పుట్టింది తమిళనాడులోని మధురైలో. 2015లో మిస్ ఇండియా ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ టైటిల్ గెలుచుకున్నా. ఆ అవార్డు నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘ఒరు నాల్ కూతు’ అనే తమిళ సినిమాలో అవకాశానికి కారణమైంది. ఆ తర్వాత సినిమాలే ప్రపంచం అయిపోయాయి.
నా పదకొండేండ్ల వయసులో మేం దుబాయ్ వెళ్లిపోయాం. చదువంతా అక్కడేసాగింది. నాకు రేసింగ్ అంటే ఇష్టం. ఫార్ములా రేసింగ్‌లో కారు నడుపుతూ ఈ లోకాన్నే మరిచిపోతా. నాకు బాక్సింగ్ కూడా వచ్చు. నా జోలికి ఎవరైనా వస్తే రప్ఫాడించేస్తా (నవ్వుతూ..). హీరో అజిత్ ఈ విషయంలో నాకు ఆదర్శం. డాక్యుమెంటరీ సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్, పెయింటింగ్, మ్యూజిక్ వినడం నా అలవాట్లు. ఖాళీ దొరికితే ఏదో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తా. తాజాపండ్లు, పెరుగు, గ్రీన్ టీ అంటే ఇష్టం. పారిస్, దుబాయ్, లండన్, బ్రెజిల్ నా ఫేవరెట్ హాలిడే స్పాట్లు.
మహిళ అనగానే చిన్నచూపు చూస్తారు. కాస్త ప్రోత్సహిస్తే మహిళలు ఏదైనా సాధించగలరు. సోషల్ మీడియాలో కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి. గతంలో నా ఫొటోలను మార్ఫింగ్ చేసి బికినీ వేసుకున్నట్టుగా వైరల్ చేశారు. అలాంటివాళ్లను చూస్తే ఒళ్లు మండుతుంది. వారికి ఉన్నట్టే మిగతావారికి కూడా కుటుంబం ఉంటుంది. వాళ్లు బాధపడతారనే ఇంగిత జ్ఞానం ఉండదా?
గ్లామర్ పాత్ర అనగానే స్కిన్ షో అనుకుంటారు. ఆ అభిప్రాయం మారాలి. కలకాలం మనకు గుర్తుండిపోయేదే అసలైన గ్లామర్ పాత్ర. అర్ధనగ్నంగా కనిపించడమో, ఇంకోలా
పోజులివ్వడమో గ్లామర్ కానేకాదు.
ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉంది. ఆ కల ఎప్పటికి తీరుతుందో! ఏ దర్శకుడు ముందుకొస్తాడో మరి. సీనియర్ నటి సౌందర్య అంటే ఇష్టం. చిన్నప్పుడు
ఆమె సినిమాలు బాగా చూసేదాన్ని. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మనకు దూరమైపోయారు.
ఇప్పటికైతే నా ప్రయాణం సాఫీగా, సంతోషంగా సాగిపోతున్నది. అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆచితూచి కథలు ఎంచుకుంటున్నా. ఇతరులతో పోల్చుకోవడం కంటే.. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇగోలు, గొడవలు ఉండవనేది నా ఫిలాసఫీ.
తమిళ సినిమాలంటే ఇష్టం. నా కాల్షీట్స్ కోసం వచ్చే దర్శకుల్ని స్క్రిప్ట్ అడుగుతాను. ఇస్తే.. మొత్తం చదువుతాను. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదివినా తమిళంలో నేను పర్ఫెక్ట్.. తమిళం చదువుతుంటే అమ్మతో మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది.
“Nivetha Pethuraj | లంగా ఓణీలో మురిపిస్తున్న నివేదా పేతురాజ్..”