Vijay Devarakonda | రౌడీ స్టార్ విజయ దేవరకొండ షూటింగ్లో గాయపడ్డారని సమాచారం. యాక్షన్ సీన్స్‌ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. వెంటనే చిత్రయూనిట్ చికిత్స కోసం విజయ్‌ని ఆసుపత్రికి తరలించారని, వైద్యులు ఫిజియో థెరఫీ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. దీనిపై చిత్రబృందం స్పందించలేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత రౌడీ స్టార్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నట్లు టాక్. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానున్నది. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.