Actor Siddique | లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్ధిఖీ (Actor Siddique) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. అత్యాచారం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు తీర్పు అనంతరం ఆయన ఫోన్ కూడా స్విఛ్ ఆఫ్‌లో ఉంది.
దీంతో పోలీసులు కొచ్చి సమీపంలోని అలువాలో ఉన్న సిద్ధిఖీ ఇంటికి వెళ్లగా.. తాళం వేసి ఉండటంతో పోలీసు బృందం వెను దిరిగింది. సిద్ధిఖీ రాష్ట్రం విడిచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడి జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు నటుడిపై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసులను కేరళలోని అన్ని జిల్లాల పోలీసు చీఫ్‌లకు పంపించారు. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులకు కూడా ఈ నోటీసులను పంపించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపత్.. నటుడు సిద్ధిఖీపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఓ సినిమాలో అవకాశం కోసం తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధిరాలు ఆరోపించింది. ఆయన డిమాండ్లను తిరస్కరించడంతో 2016లో తిరువనంతపురంలో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రేవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం నటుడి పిటిషన్‌కు కొట్టివేసింది. ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సరైన దర్యాప్తు జరిగేందుకు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సీఎస్ డయాస్ బెయిల్‌కు తగిన కేసు కాదన్నారు. పొటెన్సీ టెస్ట్ జరగలేదని.. సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కోర్టు తీర్పుతో సిద్ధిఖీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Also Read..
Mumbai | ముంబైలో వర్ష బీభత్సం.. నేడు విద్యా సంస్థలకు సెలవు
Hindu Temple | అమెరికాలో మరో ఆలయంపై దాడి.. హిందూస్ గో బ్యాక్ అంటూ రాతలు
Governor Jishnu Dev Varma | తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ