Jn NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిగత హక్కులను రక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్‌ను జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా సోమవారం విచారించారు. ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కింద మూడురోజుల్లో చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. కేసు విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున సవివరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జస్టిస్ ప్రీతమ్ సింగ్ అరోరా తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపించారు.
అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించడం, ట్రోల్స్ చేయకుండా.. అలాగే, వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు గానీ, ఫొటో గానీ ఉపయోగించకుండా కోర్టును ఆశ్రయించారు. గతంలోనూ టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు నటులు నాగార్జున, అజయ్ దేవ్గన్,, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ సహా పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లుగా టాక్. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో దేవర-2 సైతం చేయాల్సి ఉన్నది.