ఒక్కోసారి అంతే మరి.. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా కూడా పన్ను విరుగుద్ది.. గోపీచంద్ (Gopichand) విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. ఈయన కెరీర్ లో ఓ సినిమా చాలా ఇబ్బందులు పెడుతుంది. ఆ సినిమా పేరు ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) . అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ సినిమా వచ్చి ఈ పాటికే 4 సంవత్సరాలు అయ్యుండేది. కానీ ఏం చేస్తాం.. కుదర్లేదంతే. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమా విషయమే మరిచిపోయారు దర్శక నిర్మాతలు.
నాలుగేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కూడా అదే ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాడు తాండ్ర రమేష్.
దాదాపు 18 కోట్లతో ఆరడుగుల బుల్లెట్ తెరకెక్కింది. ఈ చిత్రానికి ఇంకా బకాయిలు ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత చెప్పినా బయ్యర్లు వినడం లేదు. పక్కాగా డబ్బులు కట్టిన తర్వాత గానీ సినిమా విడుదల కానివ్వమంటున్నారు. దాంతో చేసేదేం లేక కామ్ గా ఉండిపోయాడు నిర్మాత. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ప్రకాశ్ రాజ్, నయనతార (Nayanthara) లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆరడుగుల బుల్లెట్ పరిస్థితి తయారైంది.
ఫైనాన్షియర్లకు క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఇస్తే గానీ సినిమా విడుదల కాదు. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ వుండటం.. నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాను మంచి రేటుకి తీసుకుంటామంటున్నాయి డిజిటల్ సంస్థలు. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటిటి సంస్థ 15 కోట్లకు డీల్ కూడా మాట్లాడేసినట్లు తెలుస్తుంది. అయితే కొన్నేళ్ళ కింద జీ వాళ్ళకు ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులు 8 కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో వాళ్లు ఆరడుగుల బుల్లెట్ ఓటిటి రిలీజ్ కు అడ్డు తగులుతున్నారు.
తమకు అమ్మిన తర్వాత ఇప్పుడు రేట్ ఎక్కువ వచ్చిందని ఇతరులకు ఎలా అమ్మేస్తారంటూ వాళ్లు నిలదీస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగోలా అన్నీ క్లియర్ చేసి ఆగస్టులో విడుదల చేయనున్నట్లు నిర్మాతలే ఖరారు చేసారు. అయితే అంతా అనుకుంటున్నట్లు ఈ సినిమాను ఓటిటిలో కాకుండా థియేటర్స్ లోనే విడుదల చేద్దామని చూస్తున్నారు. అయితే అది అంత ఈజీ కాదు. థియేట్రికల్ రిలీజ్ అంటే ఓటిటికి ఎక్కువ రేటు వస్తుందని నిర్మాతలే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారని ట్రేడ్ పండితుల మాట. ఏదేమైనా కూడా ఈ బుల్లెట్ దిగితే చూద్దామని గోపీచంద్ అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?