షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని పలువురు నిర్మాతలు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కొందరు నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నిర్మాతలు కేఎస్ రామారావు, అశోక్‌కుమార్, బసిరెడ్డి, మోహన్‌గౌడ్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ..ఫిల్మ్ ఛాంబర్‌కు 50ఏళ్ల చరిత్ర ఉందని, అసోసియేషన్ గౌరవాన్ని కాపాడాలని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో నిరంకుశత్వం తగదని, వెంటనే ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రతాని రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు.
ఈ నెల 30తో ఇప్పుడున్న కమిటీ గడువు ముగుస్తుందని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుంటే తామందరం రేపటి నుంచి ఇక్కడే కూర్చుంటామని నిర్మాత అశోక్ కుమార్ అన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం నిబంధనలకు విరుద్ధమని, కొందరు స్వార్థంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తప్పకుండా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు.