వనపర్తి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి సిలబస్ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి వనపర్తి జిల్లాలో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పోలీస్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. తెలంగాణ వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీలకు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీలకు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీలకు శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు పొందిన యువతీయువకులకు శిక్షణ ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలను వంద మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అనుమతులు రాగా, బీసీల శిక్షణపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఎస్సీలకు నాన్ రెసిడెన్షియల్, ఎస్టీలకు రెసిడెన్షియల్ విధానంలో రెండు నెలలు, 45 రోజులపాటు కోచింగ్ ఇవ్వనున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా శిక్షణతోపాటు నెలకు రూ.6 వేల ైస్టెఫండ్ను ఆరునెలలపాటు ఇవ్వనున్నది. ఇతర గ్రూప్స్ పరీక్షలకుగానూ శిక్షణతోపాటు నెలకు రూ.2వేలను మూడు నెలలు అందించనున్నారు. ఆన్లైన్ ద్వారా శిక్షణకు సంబంధించి పరీక్షలు రాసే అవకాశం కల్పించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో అధికారులు శిక్షణ కేంద్రాలను గుర్తిస్తున్నారు. ఎస్టీ అభ్యర్థుల కోసం నాగవరంలోని వైటీసీ భవనంలో శిక్షణ ఇవ్వనున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలాగే ఆసక్తి ఉండి ప్రభుత్వ శిక్షణ కేంద్రాలకు ఎంపిక కాని వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తన వేతనంతోపాటు సొంత సొమ్మును కూడా శిక్షణ కోసం ఖర్చు చేయనున్నారు. కోచింగ్ సెంటర్ కోసం తన ఇంటి ఆవరణను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీలోగా ఎస్సీలు, 16లోగా బీసీలు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. tsbcstudycircle, tsstudy circle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే యువతీయువకులకు ఇదో మంచి అవకాశం. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. వి డుతల వారీగా సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. శిక్షణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నాం. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోగా సెంటర్లను ప్రకటిస్తాం. ఎస్టీ అభ్యర్థుల కోసం వైటీసీ భవనాన్ని ఎంపిక చేశాం.
– షేక్ యాస్మిన్‌బాషా, వనపర్తి కలెక్టర్
ఇప్పటివరకు జిల్లాలో శిక్షణ కోసం 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి నుంచి అర్హులను షార్ట్‌లిస్ట్ చేసి శిక్షణకు ఎంపిక చేస్తాం. పోటీ పరీక్షల కు సిద్ధం చేయడంతోపాటు భౌతిక ప రీక్షలకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. శిక్షణ సమయంలో భోజన, వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిష్ణాతులైన వారితో క్లాసులు ఇప్పిస్తాం.
– ఆనంద్‌రెడ్డి, వనపర్తి డీఎస్పీ