న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 2022 నాటికి భారత్‌లో టాప్ 10 నగరాల్లో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని జిప్ ఎలక్ట్రిక్ సన్నాహాలు చేపట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రస్తుతం 5000 లాజిస్టిక్స్ ఈవీలను సరఫరా చేసిన జిప్ ఎలక్ట్రిక్ రాబోయే 18 నెలల్లో లక్ష ఈవీలతో విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది.
ఈ లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీ టెక్నాలజీ, ఆపరేషన్స్ విభాగాల్లో దాదాపు 500 మంది ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు సాగిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సంస్ధ టర్నోవర్ ఐదు రెట్లు పెరిగి రూ 25 కోట్లకు ఎగబాకుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
2022 ఆర్ధిక సంవత్సరంలో 40 లక్షల కాలుష్య రహిత డెలివరీలను అందించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుందని జిప్ ఎలక్ట్రిక్ సీఈఓ, సహ వ్యవస్ధాపకుడు ఆకాష్ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం తాము ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూర్, హైదరాబాద్, ముంబై, పుణే నగరాల్లో బిగ్‌బాస్కెట్, గ్రాఫర్స్, అమెజాన్, రాపిడో, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు ఈకామర్స్ దిగ్గజాలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.