Paytm-Zomato | ఆర్బీఐ ఆంక్షలతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నది. ఈ ఇబ్బందులను గట్టెక్కేందుకు తన సినిమాలు, ఈవెంట్స్ టికెట్ బుకింగ్ బిజినెస్ విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో సంప్రదిస్తోంది. ఈ రెండు విభాగాల విలువ రూ.1500 కోట్లు ఉంటుందని అంచనా.
ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, వినోద రంగ బుకింగ్ బిజినెస్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ విభాగాల్లో దూసుకెళ్తున్న జొమాటో.. తాజాగా వినోద రంగంలో ఎంట్రీ కోసం సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పేటీఎం ఆధీనంలో ఉన్న మూవీ, ఈవెంట్ టికెట్ బుకింగ్ బిజినెస్ సొంతం చేసుకునేందుకు జొమాటో సిద్ధం అవుతున్నట్లు తెలియవచ్చింది. రెండు సంస్థల మధ్య జరుగుతున్న సంప్రదింపులు చివరి దశకు చేరుకున్నాయని వినికిడి. దీనిపై పేటీఎం గానీ, జొమాటో గానీ స్పందించలేదు.
నోయిడా కేంద్రంగా సేవలు అందిస్తున్న పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్.. 2017లో ఈవెంట్ ఆన్ లైన్ టికెటింగ్ సేవలు అందిస్తున్న ‘ఇన్సైడర్.ఇన్’నూ, తదుపరి చెన్నై కేంద్రంగా పని చేస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ వేదిక ‘టికెట్న్యూ’ను టేకోవర్ చేసుకుంది. దీంతో కంపెనీ మార్కెటింగ్ సర్వీసెస్ లో మూవీ, ఈవెంటి టికెటింగ్ విభాగాలు కీలకంగా మారాయి.