Zero tariffs : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జీరో టారిఫ్‌ల (Zero tariffs) విషయంలో పాడిందే పాడుతున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొబోయే పలు రకాల వస్తువులపై భారత్ (India) జీరో టారిఫ్‌లను ఆఫర్ చేసిందని మరోసారి వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ నుంచి పదేపదే జీరో టారిఫ్‌ల ప్రస్తావన రావడం చర్చనీయాంశమైంది.
తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 100 శాతం తగ్గించడానికి భారత్ ఇప్పటికే అంగీకరించిందని వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తొందరలేదని, తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
ఇదిలావుంటే ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటికే జైశంకర్ స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అవి సంక్లిష్ట చర్చలని, ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునే వరకు చర్చలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని, అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందని ట్రంప్ పేరును ప్రస్తావించకుండా సెటైర్ వేశారు. అయినా ట్రంప్ మళ్లీ జీరో టారిఫ్ ప్రస్తావన తీసుకొచ్చారు.