Bankruptcy | కాలం కలిసి వస్తే ఎవరికైనా లాభాలు వచ్చి పడతాయి. స్కోప్ ఉన్నా, కంపెనీలు కుదేలవుతుండటం కనిపిస్తూనే ఉంటుంది. 2024లో పలు టాప్ కంపెనీలు రుణ బాధలు భరించలేక దివాళా ప్రక్రియ ప్రకటిస్తున్నాయి. ఆ జాబితాలో యూఎస్ బడ్జెట్ క్యారియర్ స్పిరిట్ ఎయిర్ లైన్స్ మొదలు ఎడ్యు టెక్ సంస్థ బైజూ వరకూ పలు సంస్థలు దివాళా ప్రక్రియ ప్రారంభిస్తున్నాయి. మరి కొన్ని దివాళా ప్రక్రియకు అనుమతించాలని కోరుతున్నాయి.
అమెరికాలోనే అతిపెద్ద విమానాల సంస్థ ‘స్పిరిట్ ఎయిర్ లైన్స్’ కరోనా మహమ్మారి దెబ్బతో కుదేలయింది. కరోనా తర్వాత వరుస నష్టాలు, మోయలేని రుణ భారంతో గత నవంబర్ నెలలో చాప్టర్ 11 -దివాళా ప్రక్రియకు పిటిషన్ దాఖలు చేసింది. 2020 నుంచి 2.5 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఇందులో 2025-26లో రుణ బకాయిల చెల్లింపే 100 కోట్ల డాలర్లు.
భారత్ లోని ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ గత ఫిబ్రవరిలో 120 కోట్ల డాలర్ల రుణం చెల్లించలేక దివాళా తీసింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. మాతృసంస్థతో న్యాయ పోరాటానికి సరిపడా నిధుల్లేవని బైజూస్ సీఈఓ థిమోథీ పోహి తెలిపారు.
ప్రముఖ గృహోపకరణాలు కం స్టోరేజీ బ్రాండ్ టప్పర్ వేర్ సైతం గత సెప్టెంబర్లో దివాళా పిటిషన్ వేసింది. ఎర్ల్ టప్పర్ ఎయిర్ టైన్ ప్లాస్టిక్ కంటైనర్ల కోసం 1946లో ఈ కంపెనీ స్థాపించారు. ప్రారంభం నుంచి 500 మిలియన్ డాలర్ల నుంచి 100 కోట్ల డాలర్లకు పెరిగింది. కానీ అప్పులు కూడా 100 కోట్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సూక్ష్మ, ఆర్థిక పరిస్థితుల వల్ల ఏండ్ల తరబడి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని సీఈఓ అన్ గోల్డ్ మాన్ తెలిపారు.
ఆర్థిక సంక్షోభాల్లో చికుకున్న నార్త్ ఓల్ట్ అనే స్వీడన్ బ్యాటరీ తయారీ సంస్థ గత నవంబర్ నెలలోనే అమెరికా దివాళా ప్రక్రియ కోసం దాఖలు చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థగా ఎదగాల్సిన దశలో సరిపడా నిధుల్లేక, కస్టమర్లను కోల్పోవడం వంటి కారణాలతో చాప్టర్ 11 కింద దివాళా పిటిషన్ వేసింది. సుమారు 580 కోట్ల డాలర్ల రుణం ఉంటుందని సమాచారం.
ఆంగ్లో అమెరికన్ కాస్మోటిక్స్, స్కిన్ కేర్, పెర్ఫ్యూమ్, పర్సనల్ కేర్ వస్తువుల తయారీ సంస్థ అవోన్.. దివాళా పిటిషన్ దిశగా అడుగులేస్తున్నది. గత ఆగస్టులో వరుసగా అవోన్ కంపెనీపై లా సూట్లు పడటమే దీని కారణం. టాల్క్ బేస్డ్ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ కారకం అవుతుందని 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో 2016లోనే అమెరికాలో నిషేధం విధించినా యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో అవోన్ తన ఉత్పత్తులు విక్రయిస్తోంది.