Wholesale Inflation | ఆహార ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టడంతో నవంబర్ టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ట స్థాయి 1.89 శాతానికి తగ్గింది. దీంతో 2025 ఫిబ్రవరిలో ఆర్బీఐ తన రెపోరేట్ 0.25 శాతం తగ్గించవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెల హోల్ సేల్ ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైంది. గతేడాది నవంబర్ హోల్ సేల్ ద్రవ్యోల్బణం 0.39 శాతం. ఈ ఏడాది ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతం.
అక్టోబర్ ఆహార ద్రవ్యోల్బణం 13.54 శాతం ఉంటే, నవంబర్ నెలలో 8.63 శాతానికి పడిపోయింది. కూరగాయల ధరలు అక్టోబర్ నెలలో 63.04 శాతం కాగా, నవంబర్ నెలలో 28.57 శాతానికి తగ్గాయి. ప్రత్యేకించి బంగాళా దుంపల ధరలు 82.79 శాతంగా కొనసాగుతుండగా, ఉల్లిగడ్డల ధరలు 2.85 శాతం తగ్గాయి. ఫ్యుయల్ అండ్ పవర్ ద్రవ్యోల్బణం 5.79 శాతం నుంచి 5.83 శాతానికి పెరిగింది. తయారీ వస్తువుల ధరలు కూడా 1.50 శాతం నుంచి రెండు శాతం పెరిగాయి.