ముంబై, మే 15: ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి కష్టాలు అన్నీఇన్నీ కావు. అమెరికా డాలర్ దెబ్బకు భారతీయ రూపీ గింగిరాలు తిరుగుతున్నది. డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ శుక్రవారం మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నది. తొలిసారి 96 మార్కు దిగువకు పడిపోయింది. ఒకానొక దశలో 96.14 వద్దకు వెళ్లి ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠ స్థాయిని చూసింది. చివరకు కోలుకున్నా.. మునుపెన్నడూ లేనివిధంగా 95.81 వద్ద ముగిసింది.
అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను పరుగులు పెట్టిస్తున్నది. గత రెండున్నర నెలలుగా నడుస్తున్న ఈ వార్తో.. గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్, గ్యాస్ ఉత్పత్తి ఇంచుమించుగా నిలిచిపోయింది. అంతేగాక కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో భారత్ సహా చాలా దేశాలకు రవాణా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రూపాయిపై ఒత్తిడి తీవ్రతరమవుతున్నది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది మరి. కాగా, ఇప్పటికే వంటగ్యాస్ ధరలను పెంచిన కేంద్రం.. శుక్రవారం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలనూ పెంచింది. దీంతో ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయి నష్టాలకు దారితీశాయి. ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 95.86 వద్ద మొదలైన రూపీ.. ఒకానొక దశలో 96.14 వద్దకు పడిపోయింది. తిరిగి కోలుకుని 95.81 వద్ద నిలిచింది. గురువారం ముగింపుతో చూస్తే 17 పైసలు నష్టపోయింది.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ దాదాపు 6 రూపాయలు క్షీణించింది. నిరుడు డిసెంబర్ 31న 89.88 వద్ద రూపీ వాల్యూ ఉన్నది. ప్రస్తుతం 95.81కి దిగజారింది. దీంతో గడిచిన ఈ నాలుగున్నర నెలల కాలంలో 5.93 రూపాయల విలువ (6 శాతానికిపైగా) ఆవిరైపోయినైట్టెంది. గడిచిన 6 సెషన్లలోనే దాదాపు 2 శాతం నష్టాలను చూసింది. గత ఏడాది మొత్తంగా రూపీ నష్టాలు 4.24 రూపాయలుగానే ఉండటం గమనార్హం. నిజానికి ఈ ఏడాది రూపాయి విలువను అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధమే తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫిబ్రవరి 28న ఈ వార్ మొదలవగా, తగ్గినట్టే తగ్గి ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతుండటం.. మిడిల్ ఈస్ట్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, ఇరాన్ ప్రతిదాడులు.. శాంతి స్థాపనకు అవరోధంగా మారుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
అమెరికా రిటైల్ అమ్మకాలు జోరుగా నమోదవడం, ఉద్యోగ మార్కెట్ గణాంకాలు స్థిరంగా ఉండటం.. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతల అంచనాలకు గండి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ బలపడుతున్నది. అలాగే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, కృత్రిమ మేధస్సు ప్రభావంతో భవిష్యత్తు పెట్టుబడులపై అయోమయం వంటివి కూడా డాలర్ విలువను ఎగదోస్తున్నాయని కరెన్సీ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. వీటన్నిటికి పశ్చిమాసియా యుద్ధం కూడా తోడవడంతో రూపాయి వరుస నష్టాలను చవిచూస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతకంతకూ పెరుగుతున్న వాణిజ్య లోటు కూడా రూపీని ఒత్తిడికి గురిచేస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకున్నా.. క్రూడాయిల్ ధరలు తగ్గేదాకా రూపీ నష్టాలు ఆగేలా లేవని పేర్కొంటుండటం ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నది.