న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : సిల్వర్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడులకు మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) తాత్కాలికంగా విరామం ఇచ్చాయి. యాక్సిస్, కొటక్, యూటీఐ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, టాటా.. ఇలా ఒక్కొక్కటిగా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) కార్యకలాపాలకు ప్రస్తుతానికైతే బ్రేక్ వేస్తున్నాయి. మార్కెట్లో వెండి ధరల విజృంభణ నేపథ్యంలో మదుపరుల ప్రయోజనార్థమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయా మ్యూచువల్ ఫండ్స్ ప్రకటిస్తున్నాయి.
దేశీయ స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నదో చూస్తూనే ఉన్నాం. రోజూ వేల రూపాయల్లో రేట్లు ఎగబాకుతున్నాయి. రూ.1.85 లక్షలను తాకింది. ఈ క్రమంలో టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ మంగళవారం స్కీంలో లంప్సం కొనుగోళ్లకు దరఖాస్తు, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ల (ఎస్టీపీ)ల్లో ట్రేడింగ్, కొత్త రిజిస్ట్రేషన్లను ఆపేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పింది. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఇంతేనని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఎస్ఐపీ, ఎస్టీపీల్లో నమోదైన ఇన్వెస్టర్లు షెడ్యూల్ ప్రకారం ట్రేడింగ్ చేసుకోవచ్చన్నది. ఎప్పట్లాగే రిడెంప్షన్లు, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీలు) నడుస్తాయన్నది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌తోపాటు మరికొన్ని ప్రధాన మ్యూచువల్ ఫండ్స్దీ ఇదే మాట.
సాధారణంగా బడా ఆర్థిక సంస్థలు, బ్రోకరేజీలు, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీలు తదితర మార్కెట్ మేకర్లు భౌతిక రూపంలో వెండిని కొని, ఈటీఎఫ్ యూనిట్ల కోసం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)తో దాన్ని మార్పిడి చేస్తాయి. అవే ఎక్సేంజీలపై అమ్ముడుపోతాయి. ఈ విధానం స్పాట్ మార్కెట్ సిల్వర్ ధరలకు అనుగుణంగా ఈటీఎఫ్ ధరలను ఉండేలా చేస్తుంది. కానీ మార్కెట్లో భౌతికంగా వెండి సరఫరా, లభ్యత లేనప్పుడు ఈ ప్రక్రియ పనిచేయదు. ఫలితంగా ఈటీఎఫ్ యూనిట్లు గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అవుతాయి. ఈ పరిణామం కొత్త మదుపరులకు ముప్పును తెచ్చిపెడుతుంది. ఇలా జరగకుండా ఉండాలనే మ్యూచువల్ ఫండ్స్ కొత్త, భారీగా వచ్చే అదనపు పెట్టుబడులకు బ్రేక్ ఇచ్చాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, దేశీయ విపణిలో భౌతికంగా వెండి కొరత, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే భారతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటంతో.. ప్రీమియం నేరుగా స్కీం నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)ను ప్రభావితం చేసేలా ఉంటున్నదని టాటా మ్యూచువల్ ఫండ్ అంటున్నది. అందుకే ఈ ఒడిదొడుకులు తగ్గేదాకా ఇన్వెస్టర్ల ప్రయోజనార్థం సిల్వర్ ఈటీఎఫ్‌ల్లోకి ఇన్వెస్టర్ల ప్రవేశానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు చెప్తున్నది. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే దేశీయ మార్కెట్లో వెండి ధరలు 5 నుంచి 12 శాతం (దిగుమతి సుంకాలు, జీఎస్టీ కలుపుకొని) అధికంగా ఉన్నాయి. పండుగ సీజన్, పారిశ్రామిక అవసరాలు, మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టుగా వెండి లభ్యత లేకపోవడం ఇందుకు కారణాలుగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ పేర్కొంటున్నది. దేశ, విదేశీ మార్కెట్లలో ధరల వ్యత్యాసం వల్ల కొత్త ఇన్వెస్టర్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని, అలాంటప్పుడు మార్కెట్ స్థిరీకరిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నది. నిజానికి చాలా సిల్వర్ ఈటీఎఫ్‌లు ప్రస్తుతం తమ నికర ఆస్తి విలువల సూచికను మించి 5-10 శాతం ప్రీమియంల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఇదంతా అని పరిశ్రమ విశ్లేషకులు చెప్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ వెండి రేట్లుంటే మ్యూచువల్ ఫండ్స్ సస్పెన్షన్‌ను ఎత్తివేసే వీలున్నది.
సాధారణంగా బడా ఆర్థిక సంస్థలు, బ్రోకరేజీలు, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీలు తదితర మార్కెట్ మేకర్లు భౌతిక రూపంలో వెండిని కొని, ఈటీఎఫ్ యూనిట్ల కోసం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)తో దాన్ని మార్పిడి చేస్తాయి. అవే ఎక్సేంజీలపై అమ్ముడుపోతాయి. ఈ విధానం స్పాట్ మార్కెట్ సిల్వర్ ధరలకు అనుగుణంగా ఈటీఎఫ్ ధరలను ఉండేలా చేస్తుంది. కానీ మార్కెట్లో భౌతికంగా వెండి సరఫరా, లభ్యత లేనప్పుడు ఈ ప్రక్రియ పనిచేయదు. ఫలితంగా ఈటీఎఫ్ యూనిట్లు గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అవుతాయి. ఈ పరిణామం కొత్త మదుపరులకు ముప్పును తెచ్చిపెడుతుంది. ఇలా జరగకుండా ఉండాలనే మ్యూచువల్ ఫండ్స్ కొత్త, భారీగా వచ్చే అదనపు పెట్టుబడులకు బ్రేక్ ఇచ్చాయి.
ముంబై: రూపాయి గింగిరాలు కొడుతున్నది. బక్కచిక్కుతున్న దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతోపాటు దేశీయ ఈక్విటీలు భారీగా నష్టపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా రూపాయి పతనానికి పరోక్షంగా కారణమైందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనం చెంది 88.81 కి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టడంతోపాటు రిజర్వుబ్యాంక్ జోక్యం చేసుకోవడంతో భారీ పతనానికి బ్రేక్‌లు పడ్డాయి. 88.73 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 88.82 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 13 పైసలు నష్టపోయి 88.81 వద్ద ముగిసింది. డాలర్ మరింత బలోపేతం అవుతుండటంతో ఇతర కరెన్సీలు బక్కచిక్కుతున్నాయని, ముఖ్యంగా ప్రాంతీయ కరెన్సీల్లో రూపాయి అత్యంత బలహీనమైన కరెన్సీ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసర్చ్ అనలిస్ట్ దిలీప్ తెలిపారు. సమీప భవిష్యత్తులో రూపాయి విలువ 88.50 నుంచి 89.10 మధ్యలో కొనసాగవచ్చునని అంచనావేస్తున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. మంగళవారం మరో ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టించాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,30,800 పలికింది. ఈ ఒక్కరోజే రూ.2,850 పుంజుకున్నది. ధంతేరాస్ దృష్ట్యా రిటైలర్లు, జ్యుయెల్లర్స్ నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక వెండి రేట్లు పెద్ద ఎత్తున పెరుగుతూపోతూనే ఉన్నాయి. మంగళవారం కూడా కిలో ధర రూ.6,000 ఎగబాకింది. దీంతో మొదటిసారి రూ.1,85,000గా నమోదైంది. హైదరాబాద్ విషయానికొస్తే.. తులం 24 క్యారెట్ రూ.2,950 ఎగసి రూ.1,28, 350గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.2,700 అందుకుని రూ.1,17,650గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,140.34 డాలర్లు పలికింది. ఒకానొక దశలో ఆల్‌టైమ్ హైని తాకుతూ 4,179.71 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ 53.54 డాలర్లుగా ట్రేడైంది. ట్రంప్ సుంకాలు, స్టాక్-కరెన్సీ మార్కెట్ ఒడిదొడుకులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ధరలకు రెక్కల్ని తొడుగుతున్నాయి.