X users : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ షేర్లు (Elon musk) అమాంతం పెరిగిపోతున్నాయి. కానీ, ఓ విషయం మాత్రం ఆయనను కలవరపాటుకు గురిచేస్తోంది. తన సామాజిక మాధ్యమమైన ‘ఎక్స్’ (X) ను అమెరికన్లు పెద్ద సంఖ్యలో వీడుతున్నారు. ఎక్స్‌ను వీడిన వారంతా బ్లూ స్కైలో (Bluesky) చేరుతున్నారు. దాంతో ఆ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూ స్కై అనతికాలంలోనే 10 మిలియన్ల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. అమెరికాలో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ ఛార్ట్‌లో నిలిచింది. మరి మస్క్ చేసిన తప్పేంటి..? ఉన్నట్టుండి యూజర్లంతా బ్లూ స్కైకి ఎందుకు మారుతున్నారు..? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం..
ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రంప్ ప్రచారానికి ఆయన పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంతోపాటు స్వయంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఇది కొంతమంది అమెరికన్లకు రుచించలేదు. ట్రంప్ విజయం అనంతరం ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆ వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. ఇకపై ‘ఎక్స్’ పూర్తిగా రైట్‌వింగ్‌కు మాత్రమే పెద్దపీట వేస్తుందన్న అంచనాలు ‘అసంతృప్తులను’ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసేలా చేశాయి.
అంతేగాక ఎక్స్ ఇటీవల సవరించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ కూడా యూజర్లు వీడిపోవడానికి మరో కారణమైంది. తన ఏఐ చాట్‌బాట్ మోడల్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చేందుకు యూజర్లు చేసే పోస్టులు, ఫొటోలను వాడుకుంటామని అందులో పేర్కొనడం మరో కారణమని చెప్పవచ్చు.
ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే స్థాపించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామే ఈ బ్లూ స్కై. 2019లో దీన్ని ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్‌గా రూపొందించారు. తొలుత ఇన్విటేషన్ ఆధారంగా తీసుకొచ్చారు. ఈ ఏడాది దాన్ని పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి తెచ్చారు. సెప్టెంబర్ వరకు 10 మిలియన్ యూజర్లు మాత్రమే ఉండగా.. ఎన్నికల తర్వాత దానికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం 19 మిలియన్ యూజర్లతో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇది అచ్చం ఎక్స్లానే పనిచేస్తుంది. ఫొటోలు, వీడియోలు, డైరెక్ట్ మెసేజ్‌లు పంపించొచ్చు.
అయితే దీనిలో యూజర్లు ఫాలో అయ్యే అకౌంట్ల నుంచి ఫీడ్ మాత్రమే చూపిస్తుంది. వ్యక్తులే తమ ఫీడ్‌ను కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది. మిగిలిన కంపెనీల్లా యూజర్ల డేటా కంపెనీ సొంత సర్వర్లలో ఉండదు. యూజర్లు కావాలనుకుంటే సొంత సర్వర్లను వాడుకోవచ్చు. లేదా సంస్థ సర్వర్‌పై ఆధారపడొచ్చు. అయితే మెటాకు చెందిన థ్రెడ్స్ కూడా ఎక్స్‌కు పోటీగా వచ్చినప్పటికీ.. దాని అల్గారిథమ్ పొలిటికల్ పోస్టులకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం ‘బ్లూ స్కై’కి కలిసొచ్చింది. ఇప్పటికే జర్నలిస్టులు, అథ్లెట్లు, ప్రముఖులు బ్లూస్కై ఖాతాలు తెరవడంతో.. బ్లూ స్కై తన టీమ్‌ను పెంచుకునే పనిలో పడింది.