Price Index | న్యూఢిల్లీ, డిసెంబర్ 14: గత కొన్ని నెలలుగా ప్రతికూలంగా ఉన్న టోకు ధరల సూచీ మళ్లీ పుంజుకున్నది. కూరగాయలు, ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగడంతో నవంబర్ నెలకుగాను టోకు ధరల సూచీ ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి 0.26 శాతానికి తాకింది. ఈ ఏడాది మార్చి నెలలో 1.41 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలతోపాటు మినరల్స్, యంత్రాల పరికరాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తులు, వాహనాలు, ఇతర రవాణాకు సంబంధించిన పరికరాల ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లనే టోకు ధరల సూచీ భారీగా పెరిగిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతానికి ఎగబాకగా, అక్టోబర్లో ఇది 2.53 శాతంగా ఉన్నది. మరి ముఖ్యంగా ఉల్లిగడ్డ ధరలు 101 శాతం పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఉల్లి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ఉల్లి ధర రూ.80 నుంచి రూ.40కి దిగొచ్చాయి. అలాగే అక్టోబర్లో మైనస్ 21 శాతంగా ఉన్న కూరగాయల ధరల సూచీ గత నెలలో 10.44 శాతానికి చేరుకున్నది. వీటితోపాటు వరి, పండ్ల ధరల సూచీ 10.44 శాతం, 8.37 శాతంగా నమోదైంది.