Whatsapp Banking | టెక్నాలజీ అభివృద్ధి చెందడంతోపాటు యుటిలిటీస్ సేవలు దాదాపు డిజిటలైజ్ అయ్యాయి. రోజువారీ ఆర్థిక లావాదేవీలంటే బ్యాంకు ట్రాన్సాక్షన్సే గుర్తుకు వస్తాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్న బ్యాంకింగ్ వ్యవస్థ.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించడంలో ముందు వరుసలో నిలుస్తుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు కోట్లలో ఉంటారు. వారు నిత్యం పరస్పర చాటింగ్‌తోపాటు పలు సర్వీసులు పొందొచ్చు.. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇటీవలే తమ ఖాతాదారులకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే ఖాతాదారులు తొలుత తమ బ్యాంకు శాఖలో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అకౌంట్ తెరిచినప్పుడు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ బ్యాంక్ అకౌంట్ నంబర్ నమోదు చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్ చేయాలి. అప్పుడు వాట్సాప్ బ్యాంకింగ్ కోసం మీ పేరు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అటుపై +91 90226 90226 నంబర్‌కు hi అని టైప్ చేయాలి. బ్యాంకు శాఖ నుంచి వచ్చే సూచనల్ని బట్టి మీకు అవసరమైన సేవలు పొందొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటే తొలుత బ్యాంక్ వాట్సాప్ నంబర్ 86400 86400 తమ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ చేస్తేసరి. ఐసీఐసీఐ బ్యాంక్ వాట్సాప్ సేవలు పొందవచ్చు. వాట్సాప్ ప్లాట్‌ఫాం ద్వారా 9542000030 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ గానీ, ఎస్సెమ్మెస్గానీ చేసి బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
ఈ నెల 3న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం అయ్యాయి. బ్యాంక్ అకౌంట్ హోల్డర్లతోపాటు నాన్-అకౌంట్ హోల్డర్లూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ముందుగా అకౌంట్ హోల్డర్లు 91 92640 92640 ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవాలి. ఈ నంబర్‌కు హలో/ హాయ్ అనే మెసేజ్ పంపి చాటింగ్ ద్వారా మీకు అవసరమైన సేవలు పొందడానికి వీలు కలుగుతుంది.
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం తమ అకౌంట్ హోల్డర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా చాట్ బ్యాంకింగ్ పేరుతో వాట్సాప్ సేవలు పొందొచ్చు. చాట్ బ్యాంకింగ్ ద్వారా 90కి పైగా సేవలు 24 గంటలూ పొందవచ్చు. అందుకు వారు తమ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో 70700 22222 నంబర్ సేవ్ చేసుకోవాలి. ఈ నంబర్‌కు వారు హాయ్ మెసేజ్ పంపి చాట్ బ్యాంకింగ్ సేవలు అందుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం తన అకౌంట్ హోల్డర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వాట్సాప్ సేవలు ఉంటాయి. ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ బిజినెస్ నంబర్ 84338 88777కు హాయ్ అనే సందేశం పంపితే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. కొన్ని సెలెక్టెడ్ దేశాల మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందడానికి వెసులుబాటు ఉంది.
యాక్సిస్ బ్యాంక్ కూడా తన ఖాతాదారులకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అయితే, వారు ముందుగా తమ కాంట్రాక్ట్స్ లిస్ట్‌లో 7036165000 అనే ఫోన్ నంబర్ సేవ్ చేసుకోవాలి. అటుపై ఈ నంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపడంతోనే వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు మొదలవుతాయి. ఖాతాలు, చెక్‌లు, క్రెడిట్ కార్డులు, టర్మ్ డిపాఇజట్లు, రుణాలకు సంబంధించిన వివరాలు కూడా పొందొచ్చు. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా బ్యాంక్ శాఖ సెంటర్‌కెళ్లి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.