Whatsapp | ఆగస్టు నెలలోనే 74.2 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ ప్రకటించింది. అశ్లీల సమాచారం. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. జూలై ఖాతాలతో పోలిస్తే ఆగస్టులో రెండు లక్షల పై చిలుకు ఖాతాలను నిషేధించడం గమనార్హం. ఆగస్టులో 35 లక్షల పై చిలుకు ఖాతాలపై ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపింది వాట్సాప్.. ఆయా ఖాతాల డేటా విశ్లేషించిన తర్వాత ముందస్తుగానే నిషేధించామని పేర్కొంది. ఇదిలా ఉంటే గత సెప్టెంబర్ నెలలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్.. 3.1 లక్షల ఖాతాలను ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేసినట్లు వివరించింది.
తమ యూజర్లకు భద్రతాపరమైన, మెరుగైన సేవలు అందించడానికి, తమకు వచ్చిన ఫిర్యాదులను విశ్లేషించి తగిన చర్యలు చేపడుతున్నట్లు అక్టోబర్ నెల నివేదికలో తెలిపింది వాట్సాప్. ఇందుకోసం అనుభవం గల ఇంజినీర్లు, డేటా శాస్త్రవేత్తలు, విశ్లేషకులను నియమించుకున్నామని వివరించింది. వారంతా అనుమానితుల డేటాను విశ్లేషించిన తర్వాత నిషేధించాలా.. హెచ్చరికలు జారీ చేయాలా? అన్న నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. యూజర్ల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను వాట్సాప్ తన నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు గల ప్రతి సోషల్ మీడియా వేదిక నెలవారీగా నివేదిక ప్రచురించడంతోపాటు యూజర్ల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వివరించాల్సి ఉంటుంది.