2000 Note | న్యూఢిల్లీ, మే 23: రిజర్వ్‌బ్యాంక్ సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్న రూ. 2000 నోట్ల డిపాజిట్, మార్పిడి లావాదేవీలను మంగళవారం నుంచి బ్యాంక్‌లు దేశవ్యాప్తంగా ప్రారంభించడంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక్కో బ్యాంక్ ఒక్కో నిబంధనను పాటించడం, పోస్టాఫీసులు మార్పిడిని ఆమోదించకపోవడంతో ప్రజలు ఇటూఇటూ పరుగులు తీశారు. చాలా మంది పెట్రోల్ బంక్‌లను ఆశ్రయించగా, జొమోటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు చెల్లించి రెండువేల నోట్లను వదిలించకున్నారు. ఈ నోట్లను డిపాజిట్/మార్పిడి చేసేందుకు సెప్టెంబర్ 30 గడువుతేదీగా ఆర్బీఐ నిర్దేశించిన సంగతి తెలిసిందే. తొలిరోజున పలు బ్యాంక్ శాఖల్లో చిన్నపాటి క్యూలు కన్పించాయి. మార్పిడికి ప్రత్యేకమైన డెస్క్‌లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం పెద్దగా రష్ లేదని, ఇంకా నాలుగు నెలల గడువు ఉండటం కారణం కావచ్చని ఒక ప్రభుత్వ బ్యాంక్ అధికారి చెప్పారు. అయితే కొన్ని శాఖల్లో నోట్ల మార్పిడి కోసం ప్రజల ఐడీ ప్రూఫ్‌ను అడుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని బ్యాంక్‌ల్లో కేవలం సిస్టమ్‌లో ఎంట్రీ చేసుకుని నోట్లను మారుస్తుండగా, మరికొన్ని ఖాతాదారులను రిజిష్టర్‌లో పేరు, మొబైల్ నంబర్ రాయమని అడుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లను పాన్ లేదా ఆధార్ కార్డ్ ఇవ్వమని కోరుతున్నాయి. అతికొద్ది శాఖల్లో మార్పిడికి బదులు డిపాజిట్ చేయమని కోరుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి.
రూ.2000 మార్చిడి లేదా డిపాజిట్ కోసం ఆధార్ తదితర ఐడీ కార్డులు, రిక్వస్ట్ స్లిప్‌లు తీసుకోవడానికి సంబంధించి బ్యాంక్‌లకు ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలేమీ జారీచేయలేదు. ఎటువంటి నియంత్రణలు లేకుండా నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు, ఇతర చట్టబద్ద అవసరాలకు అనుగుణంగా బ్యాంక్‌లు కస్టమర్ల ఖాతాల్లో రూ.2000 నోట్లు డిపాజిట్ చేసుకోవాలని ఆదేశించింది. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ (సీటీఆర్), అనుమానాస్పద ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ (ఎస్టీఆర్) నిబంధనల్ని పాటించాలని కోరింది. ఆయా బ్యాంక్‌లు వాటి నిబంధనలకు తగినరీతిలో రూ.2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ చేసుకుంటాయని సోమవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్కో బ్యాంక్ ఒక్కో విధానాన్ని పాటిస్తున్నది. వినతి చిటీలు, పాన్‌కార్డ్, గుర్తింపు కార్డులు లేకుండానే రెండు వేల నోట్లను మార్పిడి చేస్తామంటూ కొన్ని బ్యాంక్‌లు ప్రకటించగా, మరికొన్ని బ్యాంక్‌లు వాటిని సమర్పించమని, ఫారాల మీద సంతకాలు చేయమని అడుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏ బ్యాంక్‌లు ఏమంటున్నాయంటే…
ఎస్బీఐ: రూ.20,000 వరకూ రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎటువంటి రిక్విజిషన్ స్లిప్ లేకుండానే ఖాతాదారులను అనుమతిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
పీఎన్బీ: రెండు వేల నోట్ల మార్పిడికి ప్రభుత్వం జారీచేసిన ఆధార్ తదితర గుర్తింపు పత్రాలేవీ బ్యాంక్ శాఖకు ఇవ్వాల్సిన అవసరం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
కొటక్ మహీంద్రా బ్యాంక్: తమ వద్ద ఖాతాలు లేని కస్టమర్ల నుంచి ఐడీ ప్రూఫ్‌లు/ఫారంలు కొటక్ మహీంద్రా బ్యాంక్ అడుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
సౌత్ ఇండియన్ బ్యాంక్: అధికారిక ధృవీకరణ పత్రాన్ని ఇస్తేనే తమ వద్ద ఖాతాలేని కస్టమర్ల వద్దనున్న రెండు వేల నోట్లను ఆ బ్యాంక్ మార్పిడి చేస్తున్నట్టు సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోపై కస్టమర్లు రూ.2000 నోట్లను కుప్పగా పోశారు. తమ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లలో శుక్రవారం నుంచి 72 శాతం చెల్లింపులు రూ.2000 నోట్ల రూపంలోనే జరిగాయని జొమాటో తాజాగా వెల్లడించింది.
రూ.2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవడానికి అవకాశం లేదని, ఈ సదుపాయం బ్యాంక్ శాఖల్లో మాత్రమేనని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నోటుకు లీగల్ టెండర్ ఉన్నందున పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో కూడా మార్పిడి కుదరదు. చెల్లింపులు చేసుకోవచ్చు.
పెద్ద నోటు రద్దు దెబ్బతో పెట్రోల్ బంక్‌లు రోజువారీ అమ్మకాలకు వచ్చే సొమ్ములో రూ.2000 నోట్ల 90 శాతానికి పెరిగిపోయాయి. ఆర్బీఐ ప్రకటన వెలువడకముందు తమ నగదు అమ్మకాల్లో రెండు వేల నోట్లు 10 శాతమే ఉండేవని, ఇప్పుడు 90 శాతానికి చేరిపోయాయని, రూ.100/200 కొనుగోలుకు కూడా రూ.2000 నోటును మారుస్తున్నారని పెట్రోల్ పంప్ డీలర్లు వాపోయారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రో అవుట్‌లెట్స్‌లో చిన్న నోట్ల కొరత ఏర్పడుతున్నదని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ భన్సాల్ తెలిపారు. కస్టమర్లు డిజిటల్/కార్డ్ రూపాల్లో చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. చిన్న నోట్లను తగినన్ని తమకు అందించేలా బ్యాంక్‌లకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేయాలని భన్సాల్ కోరారు. రోజువారీ 40 శాతం వరకూ ఉండే తమ డిజిటల్ సేల్స్ ఇప్పుడు 10 శాతానికి పడిపోయాయని ఆయన తెలిపారు.