Storytelling Marketing | కథలు చెప్పగలవారే నేటి కార్పొరేట్ మార్కెటింగ్‌లో కింగ్‌లు
Storytelling Marketing | కార్పొరేట్ ప్రపంచం ఇప్పుడు ‘స్టోరీ టెల్లింగ్'ను మార్కెటింగ్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నది. మాట్లాడితే కథ చెప్పినట్టు ఉండాలి. కమర్షియల్ యాడ్స్ చూస్తే ఓ మంచి నానో కథను ఆస్వాదిస్తున్న అనుభూతి కలగాలి.
Storytelling Marketing | మాట్లాడితే కథ చెప్పినట్టు ఉండాలి. కమర్షియల్ యాడ్స్ చూస్తే ఓ మంచి నానో కథను ఆస్వాదిస్తున్న అనుభూతి కలగాలి. బోర్డ్‌రూమ్ ప్రజెంటేషన్ అయినా, వార్‌రూమ్ డిస్కషన్ అయినా కథనాత్మక పద్ధతిలో సాగాల్సిందే. అనగనగా అని మొదలుపెట్టకపోయినా ఫర్వాలేదు. అందాల రాకుమారి ప్రస్తావన లేకపోయినా ఇబ్బంది లేదు. ఒంటికొమ్ము రాక్షసుడు, రెక్కలగుర్రం, సుకుమార రాకుమారుడు.. పాత్రలు మీ ఇష్టం. కానీ, మంచికథలోని ముడిసరుకులన్నీ కుమ్మరించాలి. చిటికెడు ఎమోషన్, కాస్తంత సస్పెన్స్, అక్కడక్కడా పంచ్‌లు.. పడాల్సిందే! కార్పొరేట్ ప్రపంచం ఇప్పుడు ‘స్టోరీ టెల్లింగ్’ను మార్కెటింగ్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నది.

సినిమా తీయడం వచ్చినా, రాకపోయినా.. కథ చెప్పడం వస్తే చాలు. స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు సమర్పించుకుంటారు. ఇక ముహూర్తం షాట్‌కు ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమా పరిశ్రమలో కథలు చెప్పగలిగేవాడే మొనగాడు. టాలీవుడ్, బాలీవుడ్లే కాదు.. కార్పొరేట్ ప్రపంచమూ ఆ నైపుణ్యాన్ని గుర్తిస్తున్నది, గౌరవిస్తున్నది. ‘స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్షిప్ స్కిల్’ అంటారు ఆనంద్ మహీంద్రా. బోర్డ్ మీటింగ్‌లో బాసులు.. గణాంకాలూ, గ్రాఫులూ అడగటం లేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల కోసం పట్టుపట్టడం లేదు. ‘వాట్స్ యువర్ స్టోరీ?’ అనే వాకబు చేస్తున్నారు. కారణం.. కథలో ఉద్వేగాలు ఉంటాయి, సమాచారం ఉంటుంది, సమయమూ సందర్భమూ ఉంటాయి. అన్నిటికీ మించి మనిషి అనేవాడు కథకు త్వరగా కనెక్ట్ అవుతాడు.

‘అనగనగా..’ అనే మాట వినిపిస్తే చాలు నోస్టాల్జియా తన్నుకొచ్చేస్తుంది. బాల్యంలోకి వెళ్లిపోతాడు. పసివాడైపోతాడు. గోరుముద్దలు, డాబా మీద వెన్నెల రాత్రులు గుర్తుకొస్తాయి. ఎదుటి మనిషి చెబుతున్న విషయాన్ని నేరుగా మనసులోకి తీసుకుంటాడు. మనసు క్యాన్వాసు మీద విజువలైజ్ చేసుకుంటాడు. మళ్లీమళ్లీ నెమరేసుకుంటాడు. ఇష్టమైన వాళ్లతో పంచుకుంటాడు. కాబట్టే, కథను మించిన ప్రచార మాధ్యమం లేదనే నిర్ణయానికొచ్చింది కార్పొరేట్ ప్రపంచం. వాణిజ్య ప్రకటనల నుంచి బోర్డ్‌రూమ్ సందేశాల వరకూ దేన్నయినా కథనాత్మక పద్ధతిలో చెప్పాలని తహతహలాడుతున్నారు. కావాలంటే టీవీలో యాడ్స్‌ను గమనించండి. గతంలో ఉత్పత్తుల గురించి ఊదరగొట్టేందుకే ఆ అర నిమిషం నిడివిని ఉపయోగించుకునేవారు. ఇప్పుడలా కాదు. ఓ చక్కని కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికే ఓ మెరుపులాంటి ముగింపు ఇస్తున్నారు. దీనివల్ల కథ గుర్తుండిపోతుంది. దాంతోపాటే, ప్రకటనా గుర్తుండిపోతుంది.
నా విజ్ఞానం పెంచుకుంటాను. నిజాలు చెప్పండి. బలంగా విశ్వసిస్తాను. మంచి కథలు చెప్పండి. కలకాలం గుర్తుంచుకుంటాను.
-ఉత్తర అమెరికా సామెత
కతలు వర్సెస్ కథలు
ఇరానీ హోటల్లోనో, బార్ అండ్ రెస్టారెంట్లోనో ఫ్రెండ్స్‌తో చాలా కథలే చెబుతుంటాం. అవన్నీ పైపై కతలు! కార్పొరేట్ కథలకు అంకెలు ఆధారం. సమయం, సందర్భం ప్రధానం. ఉద్వేగం అంతరాత్మ. అలాంటి కథలు వండివార్చడానికి క్రియేటివ్ డిపార్ట్మెంట్లు రేయింబవళ్లు బుర్రలు బద్దలుకొట్టుకుంటాయి. కొన్ని సంస్థల్లో బిజినెస్ స్టోరీ టెల్లింగ్ ప్రత్యేక విభాగంగా అవతరిస్తున్నది. ఆ మధ్య మార్కెట్లో విడుదలైన ‘స్టోరీస్ ఎట్ వర్క్’ పుస్తకం సంచలనం సృష్టించింది. రచయిత ఇంద్రనీల్ చక్రబర్తి టాప్‌టెన్ రైటర్స్ జాబితాలో చేరిపోయారు. తను ఇప్పటికే ‘స్టోరీ టెల్స్’ అనే కన్సల్టెన్సీ నడుపుతున్నారు. ఓ పదిహేనువందల మందికి కార్పొరేట్ కథా రచనలో శిక్షణ ఇచ్చారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా భారతీయ స్టోరీ టెల్లర్స్ కార్పొరేట్ లాబీల్లో దర్శనమిస్తున్నారు. యామినీ నాయుడు ప్రొఫైల్ కూడా అలాంటిదే. ‘నేను కార్పొరేట్ స్టోరీ టెల్లర్ కావాలనుకుంటున్నా?’ అన్నప్పుడు కుటుంబసభ్యులే నొసళ్లు చిట్లించారు. ‘హాయిగా ఏ ఐటీ కొలువో చూసుకోకుండా ఇదేం పని?’ అని చులకన చేసి మాట్లాడారు. ఆ తర్వాత కథ మారిపోయింది.

మెదడుకు మేత
ఎదురుగా ఓ మహావ్యక్తి సందేశం. ఉపనిషత్ వాక్యం. పురాణ నీతి. చిట్టచివరి వరుసలో ‘అనగనగా..’ అంటూ ఓ చిన్నకథ. మన దృష్టి సహజంగానే కథ మీద పడుతుంది. కారణం, కథతో మనం కనెక్ట్ అవుతాం. కథంటే ఓ బాల్య జ్ఞాపకం. ఊసుల ఊయల. కల్పనల గోరుముద్ద. చందమామ సాక్షిగా, వెన్నెల చెట్టు కింద అమ్మ సృజనాత్మక విన్యాసం. తరచూ చానల్స్‌లో కనిపించే ఓ చాయ్‌పత్తా యాడ్నే తీసుకోండి.. మునుపట్లా రంగు, రుచి, వాసనల జోలికి వెళ్లడం లేదు. నేరుగా కథలోకే. ఓ ప్రొఫెసర్‌గారు ఇంటికొస్తారు. శిష్యుడు చాయ్ కలిపి ఇస్తాడు. ‘ఎలా ఉంది సార్?’ అని వినయంగా అడుగుతాడు. ‘నేను అప్పుడే చెప్పానా ఎక్కడైనా మంచి టీకొట్టు పెట్టుకోమని..’ అంటూ కితాబు ఇస్తారు ప్రొఫెసర్జీ. టీనేజీతో, గురుశిష్య సంబంధంతో ముడిపడిన కథ ఇది. అన్న-చెల్లి, భార్య-భర్త, యజమానురాలు-పనిమనిషి.. రెండుమూడు పాత్రలతోనే కథలను సృష్టించి.. కొసమెరుపుతో తళుక్కుమనిపిస్తున్నారు. పనిలో పనిగా బ్రాండ్ ప్రమోషనూ కానిస్తున్నారు.
కార్పొరేట్ స్ట్రాటజిస్టులే కాదు, న్యూరో సైంటిస్టులు కూడా కథకూ, మెదడుకూ ఉన్న సంబంధాన్ని గుర్తించారు. కారణం, కథ అనేది ఓ ‘ఎక్స్‌పీరియెన్స్’. ఆ అనుభూతిని ఆస్వాదించగానే మెదడులో ఆనంద హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. కథ ఇప్పటిది కాదు. భాషతోపాటు పుట్టింది. తరచూ గుహల్లో బయటపడుతున్న ఆదిమ మానవులు గీసిన బొమ్మలు.. అమ్మలు చెప్పిన సచిత్ర కథలే కావచ్చు. ఆలోచనతోపాటు కథకూడా పెరిగింది. రామాయణాది పురాణాలూ ఒకనాటి కథలే. వాటికి ఉపకథలు, అనుబంధ కథలు, కథల వెనుక కథలు.. తోడై ‘మహా’గ్రంథాలుగా అవతరించాయి. శాంతిభద్రతల విభాగం నామమాత్రంగా ఉన్న రోజుల్లో పౌరులలో చట్టం పట్ల భయాన్ని, అనైతికత పట్ల అసహ్యాన్ని కలిగించడానికి.. కథలను, హరికథలను, తోలుబొమ్మలాటలను, డోలీ గానాలను ఓ మార్గంగా ఎంచుకున్నారు రాజులు. కఠిన హెచ్చరికలు చేయలేని పనిని ఓ కథ చేయగలదు. వంద మాటల్లో వెల్లడించలేని భావాన్ని ఓ కథ ఆవిష్కరించగలదు. మెదడు వివిధ సంఘటనలను కథల రూపంలో నిక్షిప్తం చేసుకుంటుందని తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ‘మెదడు గణాంకాలను ఇష్టపడదు. కానీ, కథలను ప్రేమిస్తుంది. కలకాలం గుర్తుపెట్టుకుంటుంది’ అని నిర్ధారిస్తున్నది ‘న్యూరో ఇమేజెస్’ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైన వ్యాసం. కాబట్టే, కార్పొరేట్ ప్రపంచం కథలను అంతగా ప్రేమిస్తున్నది.

కథనాత్మక సంభాషణ
నలుగురు మిత్రులు ఓ చోట చేరినప్పుడు.. కథనాత్మక పద్ధతిలో మాట్లాడేవారే ఆ గుంపునకు నాయకత్వం వహిస్తారు. చర్చను ఎటువైపు కావాలంటే అటువైపు మళ్లించే శక్తి వారికి ఉంటుంది. అంతేకాదు, కథనాత్మక శైలిలో పంచుకున్న జ్ఞాపకాలు, సంఘటనలే కలకాలం గుర్తుండిపోతాయి. ఉద్యోగాల ఇంటర్వ్యూలలో సైతం స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో సమాధానాలు చెప్పేవారికే ఎక్కువ మార్కులు పడతాయి. కథల కామిరెడ్లు బోర్డు సభ్యులను ఇట్టే ప్రభావితం చేయగలరు. బోర్డ్‌రూమ్ మీటింగ్‌లో ప్రశంసల జల్లులు కురిపించే శక్తి ఒక్క
కథలకే ఉంది.
గణాంకాలదేముంది.. గూగుల్తల్లి పొట్టనిండా ఉంటాయి. వాటికి ఎమోషన్ జోడించకపోతే నిస్సారం అవుతాయి. అంతేకాదు, కథలో స్ఫూర్తి ఉంటుంది. సంక్లిష్టమైన విషయాన్ని కూడా సుబోధకంగా వివరించవచ్చు. కథా సౌరభం మల్లెల పరిమళంతో పోటీపడుతుంది. మంచికథ ఒక్కచోటే ఆగిపోదు. ఒకరి నుంచి ఒకరికి.. పాకిపోతుంది. అందులోనూ సోషల్ మీడియా యుగంలో కథలకు మహాగిరాకీ ఉంది. రతన్ టాటా ఔదార్యం గురించీ, ఆనంద్ మహీంద్రా సామాజిక బాధ్యత గురించీ ఎన్ని కథలు, ఎంత చర్చ! ఇవన్నీ టాటాల బ్రాండ్ విలువనూ, మహీంద్రా ఉత్పత్తులకు విశ్వసనీయతనూ పెంచేవే. కోట్ల రూపాయల యాడ్ క్యాంపెయిన్ ద్వారా లభించనంత ప్రచారం.. ఆనంద్ మహీంద్రా ఇడ్లీల అవ్వకు ఓ చిన్నగూడు కట్టించడంతోనే వచ్చేసింది. కారణం, ఈ సాయంలో అనగనగా కథకు అవసరమైన ముడిసరుకు ఉంది. చిన్నప్పటి కథల్లోని పూటకూళ్ల బామ్మలో ఆ ఇడ్లీల అవ్వను చూసుకుంటాం. రాకుమారుడి స్థానంలో ఆనంద్ కనిపిస్తారు.
అంకెలు మనుషులను మార్చలేవు. వ్యవస్థలనూ మార్చలేవు. మార్పు కథలతోనే సాధ్యం. ఒక సంస్థ ఆత్మను పట్టుకోవడానికి కథను మించిన మార్గం లేదు. మా సంస్థల్లోనూ సిబ్బందిలో స్టోరీ టెల్లింగ్ నైపుణ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
-ఆనంద్ మహీంద్రా
ఇన్నేండ్ల తర్వాత కూడా పరమహంస యోగానంద ‘ఒక యోగి ఆత్మకథ’, మహాత్ముడి ‘సత్యశోధన’ టాప్ సెల్లర్స్ జాబితాలో స్థానం దక్కించుకుంటున్నాయంటే కారణం.. వాటిలోని కథనాత్మక శైలే! విష్ణుశర్మ ‘పంచతంత్రం’.. కథల రూపంలోని నాయకత్వ సూత్రాల సమాహారమే. కాబట్టే, బిజినెస్ మీటింగ్‌లలో ‘వాట్స్ యువర్ స్టోరీ’ అనే మాట ఊతపదంగా మారిపోయింది. ఓ క్లయింట్‌ను ఆకట్టుకున్న పద్ధతి, ఒక కస్టమర్‌తో షాపింగ్ చేయించిన తీరు, ఓ ప్రాజెక్టుకు ఆర్డర్ సంపాదించి పెట్టిన వ్యూహం, ఓ కొత్త ఐడియాకు మూలం.. కాదేదీ కథకు అనర్హం. రోజూ చూసే ఆకాశంలోనో, రోజూ చూసే నక్షత్రాల్ని చూస్తూ, రోజూ పొందని అనుభూతిని పొందడమే కవిత్వం అయినట్టు.. వృత్తి జీవితంలో ఎదురైన ఓ సంఘటనకే కథారూపం ఇస్తే చాలు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో విసుగెత్తిపోయిన జనాలు ‘అనగనగా’ అని మొదలుపెట్టగానే ఊకొడుతున్నారు. వన్స్‌మోర్ కాదు.. ‘వన్ మోర్’ అంటున్నారు.
వాస్తవాలు చెప్పండి.

Read More :
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే
“ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

