Professional Tax | కార్పొరేట్ సంస్థలో గానీ, ఐటీ కంపెనీలోగానీ, వివిధ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తాయి. వారు వేతన జీవులైనా, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారైనా సరే ‘ప్రొఫెషనల్ ట్యాక్స్’ చెల్లించాల్సిందే. అయితే వ్యక్తులెవరైనా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపు నుంచి మినహాయింపు పొందొచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రొఫెషనల్ ట్యాక్స్’పై సొంత చట్టాలు చేసుకుంటాయి. రాజ్యాంగంలోని 276 అధికరణం ప్రకారం ‘ప్రొఫెషనల్స్, వ్యాపారులు, ఉద్యోగుల’పై ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లభిస్తుందని కరంజావాలా అండ్ కో అనే లా ఫర్మ్ పార్టనర్ మన్మీత్ కౌర్ పేర్కొన్నారు.
ఆదాయం పన్ను శ్లాబ్‌ల మాదిరిగానే ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా శ్లాబ్‌ల ఆధారంగా ఖరారు చేస్తుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొఫెషనల్ ట్యాక్స్ నిబంధనలు, మార్గదర్శకాలు వేర్వేరుగా ఉంటాయి. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం సేవల కల్చర్ అమల్లోకి వచ్చింది. కొవిడ్-19 ముప్పు తొలగడంతో దాదాపు కార్పొరేట్ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం పాలసీ ఎత్తేసినా, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి ఆయా సంస్థలు.
అలా వర్క్ ఫ్రం హోం సేవలు అందిస్తున్న ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్‌లకు ‘ప్రొఫెషనల్ ట్యాక్స్’ వర్తిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్క్ ఫ్రం హోం సేవలు అందించే వారికి ప్రొఫెషనల్ ట్యాక్స్ నిబంధనలు వర్తిస్తాయా? లేదా? అన్న అంశంపై చట్టంలో క్లారిటీ లేదని, సంప్రదాయ విధానం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లొచ్చు అని కరంజావాలా అండ్ కో అనే లా ఫర్మ్ పార్టనర్ మన్మీత్ కౌర్ వ్యాఖ్యానించారు.
ఈ విషయమై సరైన మార్గదర్శకాలను గానీ, చట్టాలను గానీ ప్రభుత్వాలు రూపొందించలేదని మన్మీత్ కౌర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ అంశంపై న్యాయస్థానాలు కూడా ద్రుష్టి సారించలేదని చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ‘నాన్-ప్రొఫెషనల్ ట్యాక్స్’ రాష్ట్రంలో ఒక ఉద్యోగి ‘వర్క్ ఫ్రం హోం’ సేవలు అందిస్తున్నా.. సంస్థ ఆఫీసు రిజిస్టరైన రాష్ట్రంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాల్సిందేనని పన్ను నిపుణులు చెబుతున్నారు.