Vodafone | న్యూఢిల్లీ, మే 16: టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా..భారత్‌కు గుడ్‌బై చెప్పేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏజీఆర్‌పై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికం సేవలు అందించలేమని స్పష్టంచేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకోవడం కష్టతరమవుతున్నదని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏజీఆర్ బకాయిలపై స్పష్టతనివ్వాలని, లేకపోతే టెలికం సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్టు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ సీఈవో అక్షయ ముంద్రా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ సఫోర్ట్ లేకుండా టెలికాం సేవలు అందించలేమని, ముఖ్యంగా సర్దుబాటు స్థూల ఆదాయం(ఏజీఆర్) విధించిన రూ.30 వేల కోట్లను మాఫీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నది. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికాం సేవలు అందించలేమని, ముఖ్యంగా బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపడం లేదని లేఖలో ఆవేధన వ్యక్తంచేశారు. రూ.30 వేల కోట్ల ఏజీఆర్‌పై సుప్రీంకోర్టులో సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో విచారణ చేపట్టిన ప్రత్యేక బెంచ్ ఈ కేసు ఈ నెల 19న విచారణకు రానున్నది.