Vodafone | ప్రముఖ టెలికం సంస్థ ‘వొడాఫోన్’ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇండియాలోని ఇండస్ టవర్స్‌లో తన 2.3 బిలియన్ డాలర్ల వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వచ్చేవారం స్టాక్ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా ఇండస్ టవర్స్ లో తన వాటా విక్రయానికి సిద్ధమైనట్లు తెలియవచ్చింది. భారీగా పెరిగిపోయిన రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను వొడాఫోన్ గ్రూప్ సిద్ధం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
మొబైల్ టవర్ ఆపరేటర్ ‘ఇండస్ టవర్స్’లో వొడాఫోన్‌కు 21.5 శాతం వాటా ఉంది. తన వాటా విలువ 2.3 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లన్నీ విక్రయిస్తామని బీఎస్ఈ స్టాక్ ఫైలింగ్ లో వొడాఫోన్ తెలిపింది. తన వాటా పూర్తిగా విక్రయించాలా.. తగ్గించుకోవాలా? అన్న విషయమై వొడాఫోన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దీనిపై వొడాఫోన్ ఇండియా గానీ, దాని మాతృసంస్థ ‘వొడాఫోన్ గ్రూప్’ గానీ స్పందించేందుకు ముందుకు రాలేదు. ఇండస్ టవర్స్ యాజమాన్యం స్పందించేందుకు నిరాకరించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో తన ‘ఇండస్ టవర్స్’ వాటాలను విక్రయించడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, బీఎన్పీ పారిబాస్లను వొడాఫోన్ గ్రూపు నిర్ణయించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బ్యాంకు ఆఫ్ అమెరికా స్పందించేందుకు నిరాకరించాయి. మిగతా రెండు సంస్థలూ అందుబాటులోకి రాలేదు.
తన రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వొడాఫోన్.. ‘ఇండస్ టవర్స్’లో తన 28 శాతం వాటాను విక్రయిస్తామని 2022లోనే ప్రకటించినా, తర్వాత కొద్ది వాటా మాత్రమే విక్రయించింది. ఇండస్ టవర్స్’లో తన వాటాల విక్రయానికి ఇతర టెలికం సంస్థలతో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని వొడాఫోన్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. 42.17 బిలియన్ డాలర్ల నికర రుణాల చెల్లింపునకు ఇండస్ టవర్స్’లో తన వాటాను విక్రయించాలని వొడాఫోన్ భావిస్తున్నది.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద టెలికం టవర్ కంపెనీల్లో ‘ఇండస్ టవర్స్’ ఒకటి. ఇందులో భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్ టెల్’ వాటాదారుగా ఉంది. టవర్ ఎక్విప్మెంట్ కోసం పవర్, స్పేస్, గ్రీన్ టెక్నాలజీతోపాటు ఇతర సర్వీసులు అందిస్తున్న ఇండస్ టవర్స్’కు 2.20 లక్షల టవర్లు ఉన్నాయి.