Vistara | న్యూఢిల్లీ, నవంబర్ 11: గత పదేండ్లుగా దేశీయంగా విమాన సేవలు అందించిన విస్తారా ఎయిర్‌లైన్స్ ఇక కాలగర్భంలో కలిసిపోతున్నది. సంస్థ మంగళవారం నుంచి టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానుండటమే ఇందుకు కారణం.
దీంతో సోమవారం కంపెనీ దేశీయంగా ముంబై నుంచి ఢిల్లీకి, అలాగే అంతర్జాతీయ రూట్లో ఢిల్లీ నుంచి సింగపూర్ల మధ్య నడుపుతున్న సర్వీసులు చివరివి కానున్నాయి. భారత్‌లో విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో జనవరి 9, 2015న ఢిల్లీ నుంచి ముంబైకి తన తొలి సర్వీసును ప్రారంభించింది.
చివరి సర్వీసు కూడా ఇదే రూట్లో నడవనుండటం విశేషం. సోమవారం రాత్రి 10.50 గంటలకు ముంబైలో బయలుదేరనున్న యూకే 986 సర్వీసు ఢిల్లీకి 11.50 గంటలకు చేరుకోనున్నది. అలాగే ఢిల్లీ నుంచి సింగపూర్‌కు రాత్రి 11.45 గంటలకు బయలుదేరి వెళ్లనున్నది.
టాటా గ్రూపు, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను గతంలో ఏర్పాటు చేశాయి. గత రెండు నెలల్లో ఎయిర్ ఇండియాలో విలీనమైన రెండో సంస్థ విస్తారా కావడం విశేషం. గత నెలలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేసుకున్నది.