న్యూఢిల్లీ, డిసెంబర్ 27: రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా అవతరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ కొనుగోలుదారుల నుంచి వచ్చిన అధిక డిమాండ్ మధ్య ఇక్కడి ఇండ్ల ధరలు ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే పెరిగాయి. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ3 2021’ పేరుతో నైట్ ఫ్రాంక్ ఓ తాజా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల ధరల హెచ్చుతగ్గులపై సర్వే చేసి ఈ రిపోర్టును నైట్ ఫ్రాంక్ రూపొందించింది. గతేడాది జూలై-సెప్టెంబర్‌తో పోల్చి ర్యాంకులను ఇచ్చింది. ఇందులో హైదరాబాద్‌కు 128వ ర్యాంకు రాగా, ఈ జాబితాలో చోటుచేసుకున్న భారతీయ నగరాల్లో అగ్రస్థానం దక్కింది. మొత్తం 8 నగరాలకు చోటు దక్కగా, హైదరాబాద్‌సహా నాలుగు నగరాల్లో ధరలు పెరిగితే, మరో నాలుగు నగరాల్లో తగ్గుముఖం పట్టినట్టు తేలింది. ఇక గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టర్కీకి చెందిన ఇజ్మీర్ మొదటి స్థానంలో ఉన్నది. ఇక్కడ ఇండ్ల ధరలు 34.8 శాతం పెరిగాయి. న్యూజీలాండ్‌లోని వెల్లింగ్టన్ 33.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. నిరుడుతో చూస్తే మొత్తం 150 నగరాల్లో ఇండ్ల ధరలు సగటున 10.6 శాతం పెరగగా, 2005 జనవరి-మార్చి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి కావడం విశేషం.