Vehilcles price : టాటా మోటార్స్ (TATA Motors) కంపెనీకి చెందిన కమర్షియల్ వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. భారత మార్కెట్ (Indian Market) లో వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. వాహనం మోడల్, రకాన్ని బట్టి గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరల పెరుగుదల అమలులోకి రానుంది.
ఇన్పుట్స్ ధరలు పెరగడంతోనే కమర్షియల్ వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ కంపెనీ తెలిపింది. గత ఏడాది డిసెంబర్లో కూడా కంపెనీ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. అప్పుడు కూడా ఇన్పుట్స్ ధరల పెరుగుదలనే కారణంగా చూపింది. ప్యాసింజర్ వాహనాల ధరల పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో సఫారీ, నెక్సాన్, పంచ్, టియాగో, కర్వ్ తదితర వాహనాల ధరలు నాడు పెరిగాయి.
టాటా మోటార్స్ కంపెనీ ప్రకటించిన కొన్ని గంటలకే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కూడా తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఈ పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ద్రవ్యోల్బణ సర్దుబాటు, పెరిగిన ఖర్చులు, ఇన్పుట్స్ ధరల పెరుగుదల కారణంగా వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతి సుజుకి తెలిపింది.