Rail Coach Factory | హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్రం మొండిచేయి చూపినా.. ప్రైవేటు రంగంలో కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పి కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరింది. కేంద్రం మాటతప్పినా తాము సొంతంగానే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నామనే సందేశాన్ని ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తయారుచేస్తున్న వందేభారత్ రైళ్లకు కూడా అనేక కీలక భాగాలను సరఫరా చేస్తున్నది. ఇది నిజంగానే తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పలువురు ప్రశంసిస్తున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు దాటినా ఇంతవరకు కేంద్రం ఈ హామీని నెరవేర్చలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసి చివరికి ప్రైవేటు రంగంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు అవసరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కొండకల్లో ప్రభుత్వం మేథా సర్వో కోచ్ ఫ్యాక్టరీకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.805 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కోచ్ ఫ్యాక్టరీలో 558 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. గత ఏడాది జూన్‌లో అప్పటీ సీఎం కేసీఆర్ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ భాగస్వామ్యంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ రైల్ బోగీలతోపాటు రోలింగ్ స్టాక్ కోచెస్, లోకోమోటివ్స్, వ్యాగన్స్, ట్రైన్ సెట్, మెట్రో రైళ్లు, మోనోరైళ్లు తదితర వాటిని తయారు చేస్తున్నది.
ఇప్పటికే ఇండియన్ రైల్వేస్‌కు అవసరమైన బోగీలతోపాటు ఇతర పరికరాలను మేథా సర్వో సరఫరా చేస్తుండగా, సమీప భవిష్యత్తులో ఆసియా పసిఫిక్ దేశాలకు కూడా రైలు బోగీలు, రైలు పరికరాలను ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అంతేకాదు, ముంబాయి మోనో రైళ్లను కూడా ఇక్కడే తయారు చేయనున్నారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు కూడా వివిధ ప్రధాన పరికరాలను మేథా సర్వో సరఫరా చేస్తుండటం విశేషం.
వందేభారత్ రైళ్లకు అవసరమైన ప్రొపల్షన్, కంట్రోల్‌తోపాటు ఇతర పరికరాల సరఫరాకు సంబంధించి మేథా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్ 2021లో రూ.2,211 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నది. అంతేకాదు, ఫ్రాన్క్ చెందిన ఆల్స్టోమ్ సంస్థ భాగస్వామ్యంతో వందేభారత్‌కు అల్యూమినియమ్ బాడీలను కూడా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మేథా సర్వో కార్యకలాపాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో భవిష్యత్తులో మరో 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది.
వందేభారత్ రైళ్లకు అవసరమైన పరికరాలను మేథా సర్వో సరఫరా చేస్తుండడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వందేభారత్ రైళ్ల తయారీలో మేథా సర్వో పరిశ్రమ కీలకంగా మారిందని తెలిపారు. మన రాష్ర్టానికి చెందిన మేథా కోచ్ ఫ్యాక్టరీ అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభతో విజయవంతంగా ప్రయాణం సాగించటం తనకెంతో గర్వంగా ఉన్నదని వెల్లడించారు. మేథా కోచ్ ఫ్యాక్టరీ నిర్వాహకులు, పరిశ్రమ బృందాన్ని అభినందించారు. కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.