న్యూఢిల్లీ, అక్టోబర్ 13: అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. గురువారం యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది. ఇందులో ఆహారోత్పత్తులు, ఇంధనాల్ని మినహాయిస్తే ఇతర వస్తూత్పత్తుల ద్రవ్యోల్బణం (కోర్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) 6.6 శాతానికి పెరిగింది. 1982 తర్వాత ఈ ధరల సూచి ఇంతటి గరిష్ఠానికి పెరగడం ఇదే ప్రథమం. ఆగస్టుతో పోలిస్తే ముగిసిన నెలలో ఇది 0.6 శాతం అధికం. అలాగే సీపీఐ 0.4 శాతం అధికమయ్యింది.
ఈ పెరుగుదల ఆర్థిక వేత్తల అంచనాలకంటే ఎక్కువగా ఉంది. పరుగులు తీస్తున్న ధరల్ని అదుపుచేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి భారీగా పెంచుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా జరిగే రెండు ఫెడ్ సమావేశాల్లో మొత్తం 142 బేసిస్ పాయింట్ల మేర (1.42 శాతం) వడ్డీ రేటును పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ నెలలో ముప్పావు శాతం రేట్ల పెంపు ఖాయమని అంటున్నారు.
భారత్‌లో సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠం 7.41 శాతానికి చేరిన నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ సైతం వచ్చే డిసెంబర్ సమీక్షలో మరోసారి వడ్డీ రేటును పెంచుతుందని విశ్లేషకులు చెప్పారు. ఫెడ్ రేట్ల పెరుగుదలతో భారత్‌లో సైతం వడ్డీ రేటును పెంచకతప్పదని వారన్నారు.