న్యూఢిల్లీ, ఆగస్టు 27: యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనేది ఓ కొత్త పథకమని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిపట్ల సంతృప్తికరంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. ప్రస్తుతమున్న నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)ను వెనక్కి తీసుకోవట్లేదని, పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్), ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తెచ్చామని మంగళవారం ఇక్కడ మంత్రి తెలియజేశారు.
ఎన్పీఎస్ కంటే యూపీఎస్ ఎంతో బాగుంటుందని, ప్రభుత్వంపైనా దీనివల్ల భారం పడబోదన్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్‌ను చాలామంది ఎంచుకుంటారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయినవారికే యూపీఎస్‌ను ఎంచుకునే వీలుంటుంది. ఇందులో చివరి 12 నెలలు పొందిన జీతంలోని బేసిక్ పే సగటులో 50 శాతాన్ని నెలనెలా పెన్షన్‌గా తీసుకోవచ్చు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి రానున్నది.